BPL: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఫిక్సింగ్ కలకలం.. అనుమానాలు రేకెత్తించిన సంతోకి బౌలింగ్

  • క్రికెట్‌లో ఎవరూ ఊహించని రీతిలో బంతులు విసిరిన సంతోకి
  • క్రీజు బయటకు వచ్చేసి మరీ బౌలింగ్
  • విచారణ కోరిన సొంత జట్టు డైరెక్టర్

బంగ్లాదేశ్ క్రికెట్‌లో మరోమారు ఫిక్సింగ్ కలకలం చెలరేగింది. బుధవారం ప్రారంభమైన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో ఓ బౌలర్ తీరు అనుమానాలు రేకెత్తించింది. బీపీఎల్‌లో భాగంగా నిన్న సిలెట్  థండర్స్, రాజ్‌షాహీ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సిలెట్ థండర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 34 ఏళ్ల ఎడమచేతి మీడియం పేసర్ క్రిష్‌మర్ సంతోకి విసిరిన బంతులు చూసి మైదానంలోని ఆటగాళ్లే కాదు, స్టాండ్స్‌లోని ప్రేక్షకులు కూడా నివ్వెరపోయారు.

కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు ఓవర్ ది వికెట్ బౌలింగ్ చేసిన సంతోకి లెగ్‌సైడ్‌కు చాలా దూరంగా పుల్‌టాస్ వేశాడు. టెస్టుల్లో కూడా ఆ బంతిని నిస్సందేహంగా వైడ్ ప్రకటించేంత దూరంగా ఆ బంతి పడింది. మరో రెండు బంతుల తర్వాత వేసిన నోబాల్ అయితే.. క్రికెట్ ప్రపంచాన్నే నిర్ఘాంతపోయేలా చేసింది. ఏకంగా క్రీజు బయటకు వచ్చేసి బౌలింగ్ చేశాడు. అతడి బౌలింగ్ తీరు అనుమానాస్పదంగా ఉండడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. చూస్తుంటే అతడి బౌలింగ్‌లో స్పాట్ ఫిక్సింగ్ కోణం ఉన్నట్టు కనిపిస్తోందని కామెంట్లు చేశారు. మరోవైపు, సిలెట్ థండర్స్ జట్టు డైరెక్టర్ తంజిల్ చౌధురి కూడా సంతోకి బౌలింగ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. అతడి బౌలింగ్‌పై విచారణ జరిపించాల్సిందిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును అభ్యర్థించారు.

More Telugu News