Andhra University: దేశానికి.. ప్రపంచానికి మేధావులను అందించిన ఘనత ఆంధ్రా విశ్వవిద్యాలయానిదే: సీఎం జగన్

  • ఏయూ విశ్వ విద్యాలయంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం
  • టాప్ 5 విశ్వవిద్యాలయంలో ఏయూ ఉండాలని ఆకాక్షించిన జగన్
  • 459 బోధన సిబ్బంది ఖాళీలుండటం విచారకరం

దేశంలోని విశ్వ విద్యాలయాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం 14వ స్థానంలో ఉందన్న సీఎం జగన్, తొలి ఐదు స్థానాల్లోకి దూసుకు రావాలని ఆకాక్షించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి  ప్రారంభించారు. విశ్వ విద్యాలయ స్థాపకుడు, వీసీ దివంగత కట్టమంచి రామలింగారెడ్డి చిత్రానికి పుష్పాలు సమర్పించి నివాళులర్పించారు.  

అనంతరం రీడింగ్ రూమ్, జీఎంఆర్ బ్లాక్ హాస్టల్ భవనాలకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచానికి మేధావులను అందించిన ఘనత ఆంధ్రాయూనివర్సిటీదేనని అన్నారు. చదువుల దీపం కుటుంబానికి వెలుగు నిస్తుందని బలంగా విశ్వసిస్తానని చెప్పారు. దళితుడైన ఆదిమూలపు సురేశ్ ఐఆర్ఎస్ అధికారి అయ్యారన్నారు. ఆయన జీవితాన్ని చవి చూసిన వ్యక్తి అనే సురేశ్ కు విద్యాశాఖకు మంత్రిని చేశానన్నారు. మన కల బలంగా ఉండాలి, అప్పుడే దాన్ని సాధించగలమన్నారు.

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేస్తున్నామని సీఎం తెలిపారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలలో తొమ్మిది రకాల వసతులు కల్పిస్తామన్నారు. ఉద్యోగాలు కల్పించే విధంగా కోర్సులు ఉండాలని పేర్కొన్నారు. డిగ్రీని నాలుగేళ్లు చేస్తామన్నారు. మూడేళ్ల తర్వాత, ఒక సంవత్సరం అప్రెంటిషిప్ తప్పనిసరి చేసి డిగ్రీకి బదులు డిగ్రీ ఆనర్స్ సర్టిఫికెట్ విద్యార్థులు అందుకుంటారన్నారు. ఏయూ ఇందుకు సన్నద్ధం కావాలన్నారు.

ఇంజినీరింగ్ విద్య కూడా ఐదేళ్లు చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఐదో సంవత్సరం అప్రెంటిషిప్ కలిపి బీటెక్ డిగ్రీకి బదులు బీటెక్ ఆనర్స్ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, సురేశ్, అవంతి శ్రీనివాస్ విశ్వవిద్యాలయం వీసీ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి, అధికారులు, టెక్ మహీంద్రా సీఈవో, ఎండీ సీపీ గుర్నాని, జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ జీ. మల్లికార్జునరావు, పారిశ్రామిక వేత్తలు, మేధావులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

More Telugu News