YSRCP: వైసీపీపై కాస్తోకూస్తో ఉన్న నమ్మకం ఈ అసెంబ్లీ సమావేశాలతో పూర్తిగా ఆవిరైంది: కళా వెంకట్రావు

  • టీడీపీ సభ్యులను అడ్డుకున్న మార్షల్స్
  • తీవ్రంగా స్పందించిన కళా వెంకట్రావు
  • నిరంకుశ సీఎంలు ఏమయ్యారో జగన్ తెలుసుకోవాలని హితవు

టీడీపీ సభ్యులను మార్షల్స్ అడ్డుకోవడంపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఇంతటి అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని చూడడం ఇదే ప్రథమం అని అన్నారు. మాజీ సీఎం చంద్రబాబును అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. విపక్ష సభ్యులను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకుండా గేటు వద్దే మార్షల్స్ అడ్డుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదని, అసెంబ్లీలో అదొక దుర్దినమని అన్నారు.

మేకవన్నె పులి వంటి వైసీపీని నమ్మిన ప్రజలు అధికారం అందించారని, కానీ ఈ ఏడు నెలల్లో వారి నమ్మకం ఆవిరైందని వ్యాఖ్యానించారు. తాజా అసెంబ్లీ సమావేశాలతో మిగిలున్న ఏ కాస్తోకూస్తో నమ్మకం పూర్తిగా పోయిందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పైనా కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. నియతృంత్వ ధోరణితో వ్యవహరించిన గత సీఎంల గురించి జగన్ ఓసారి తెలుసుకోవాలని హితవు పలికారు. స్పీకర్ తమ్మినేని సీతారాంను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ, గత అసెంబ్లీ స్పీకర్లు ఎంత హుందాగా వ్యవహరించారో ఏపీ స్పీకర్ జ్ఞప్తికి తెచ్చుకోవాలని సూచించారు. ఇప్పటికైనా స్పీకర్ హుందాగా వ్యవహరించాలని అన్నారు.

More Telugu News