Telangana: అలా చేస్తే సీఎం కేసీఆర్ కు దిశ ఆశీస్సులు ఉంటాయి: స్వామి పరిపూర్ణానంద

  • ముగిసిన డీకే అరుణ మహిళా సంకల్ప దీక్ష
  • అరుణకు కొబ్బరినీళ్లు ఇచ్చి దీక్ష విరమింపజేసిన పరిపూర్ణానంద
  • తెలంగాణలో విడతల వారీగా మద్యనిషేధం విధించాలి

సీఎం కేసీఆర్ కు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పరిపూర్ణానందస్వామి ఓ సూచన చేశారు. తెలంగాణలో విడతల వారీగా మద్యనిషేధం విధించాలని, అలా చేస్తే కనుక, దిశ ఆశీస్సులు ఆయనకు ఉంటాయని అన్నారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నేత డీకే అరుణ చేపట్టిన రెండురోజుల మహిళా సంకల్ప దీక్ష ముగిసింది.

అరుణకు కొబ్బరినీళ్లు ఇచ్చి దీక్షను విరమింపజేసిన అనంతరం, పరిపూర్ణానంద మాట్లాడుతూ, తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కేసీఆర్ కు సూచించారు. సమత, మానస, దిశతో పాటు అత్యాచారాలకు గురైన మహిళల కోసం అరుణ దీక్ష చేయడం గొప్పనిర్ణయమని కొనియాడారు. ఈ సందర్భంగా దిశ ఘటన విషయంలో హోం మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.  

మహిళల భద్రత కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని పరిపూర్ణానంద పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు గురించి ప్రస్తావించారు. ఈ కేసు విషయం ఏమైందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు గురించి మాట్లాడుతూ.. ఈ బిల్లుకు టీఆర్ఎస్, శివసేన పార్టీలు మద్దతు ఇవ్వకపోవడం వారి అవకాశవాదానికి నిదర్శనమని విమర్శించారు.

More Telugu News