స్పీకర్ కు బాధ్యత లేదు.. ముఖ్యమంత్రికి అనుభవం లేదు: చంద్రబాబునాయుడు

13-12-2019 Fri 17:31
  • చీఫ్ మార్షల్ పై దుర్భాషలాడలేదు..ఎవిడెన్స్ లేదు
  • ఆధారం లేకపోయినా కొంత మంది ఉద్యోగస్తుల స్టేట్ మెంటా?
  • జగన్ కు గర్వం.. ఒళ్లంతా కొవ్వు

చీఫ్ మార్షల్ ను చంద్రబాబునాయుడు దుర్భాషలాడారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబుపై వైసీపీ సభ్యులు విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలను చంద్రబాబునాయుడు ఖండించారు.

మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంత జరుగుతున్నా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం బాధ్యత లేకుండా, పద్ధతి లేకుండా వ్యవహరించారని, ‘ఇదేనా హుందాతనం?’ అని ప్రశ్నించారు. సీఎం జగన్ కు అనుభవం లేదు కానీ గర్వం ఉందని, ఒళ్లంతా కొవ్వు కూడా ఉందని, ఒక ఆంబోతు మాదిరి ఎగిరెగిరి పడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చీఫ్ మార్షల్ ను తాను దుర్భాషలాడినట్టు ఎవిడెన్స్ లేదని, ఆధారం లేని దానికి కూడా కొంత మంది ఉద్యోగస్తుల నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారని విమర్శించారు. ‘ఇది రాజకీయపరమైన విషయం..మీరు ఇన్వాల్వ్ కావద్దు’ అని ఉద్యోగస్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. అలాంటి పదం తాను వాడానని ఉద్యోగస్తులు నిర్ధారించుకుంటే తాను సవరించుకుంటాను తప్ప, ఎవరో చెప్పారని రియాక్టు కావొద్దని, అది న్యాయం కాదని అన్నారు.