Assmebly Andhrapradesh: అవినీతిపై అంబటి ఛలోక్తులు.. ప్రహ్లాదుని పద్యం వినిపించిన వైనం!

  • ఎందెందు వెదికినా అందందు అవినీతి అంటూ.. పద్యం
  • పరాకాష్ఠకు చేరిన అవినీతిని రూపుమాపేందుకే జగన్ సీఎం అయ్యారు
  • ఐదున్నరేళ్లలో అవినీతి రాష్ట్రంలో విస్తరించిందన్న ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అవినీతి నిర్మూలనపై శాసన సభ్యుడు అంబటి రాంబాబు ప్రసంగం విమర్శలు, ఛలోక్తులతో సాగింది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడిపై విమర్శలతో  విరుచుకుపడ్డారు. పాలనలో పారదర్శకత, అవినీతి నిర్మూలన, పూర్వ న్యాయ పరిశీలన, రివర్స్ టెండర్స్ మీద జరుగుతున్న చర్చలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఈ చర్చను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూడాలి, వినాలని పేర్కొన్నారు. అవినీతి అనేది సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక క్యాన్సర్ లాంటి వ్యాధి అని చెప్పారు. అవినీతిని నిర్మూలించాల్సిన అవసరముందంటూ.. రాష్ట్రంలో గత ఐదున్నరేళ్లలో అవినీతి పరాకాష్ఠకు చేరుకుందని వ్యాఖ్యానించారు. ఏపీ ఎదుర్కొన్నంత అవినీతిని దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎదుర్కోలేదన్నారు.

అసెంబ్లీలో ప్రహ్లాద ఘట్టం

ఈ సందర్భంగా భాగవతంలోని ప్రహ్లాద చరిత్రలోని ఒక ఘట్టాన్ని అంబటి సభలో ప్రస్తావించారు. ప్రహ్లాదుడు ఎప్పుడూ హరిని స్మరిస్తూంటే.. తండ్రి హిరణ్యాక్షుడు 'ఎక్కడున్నాడురా నీ హరి?' అని ప్రశ్నిస్తే.. ప్రహ్లాదుడు 'ఇందుగలడందులేడని సందేహము వలదు.. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసినా అందందే గలడు దానవాగ్రణి కంటే..' అన్న పద్యాన్ని చదివారు.

ఈ పద్యాన్ని ఏపీలో నెలకొన్న అవినీతికి అన్వయిస్తూ సభలో నవ్వులు పూయించారు. ‘నేను ఈ ఘట్టాన్ని ఎందుకు చెప్పానంటే... ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుని అవినీతిపై ప్రశ్నించినప్పుడల్లా ఎక్కడుంది అవినీతి? అని తిరిగి ప్రశ్నిస్తారు... ఈ ఘట్టం ఆయన పాలనకు అద్దం పడుతుంది. ఇందు గలదందు సందేహం వలదు.. అవినీతి సర్వం వ్యాపించింది ఆంధ్ర రాష్ట్రంలో.. ఎందెందు వెతికి చూసినా అందందే గలదు చంద్రబాబుగారు వింటే’ అని వ్యంగ్యంగా చెప్పారు.  

ఈ మైక్.. అసెంబ్లీ.. రాజధాని.. అవినీతిమయమే..!

ఇక్కడుందా అని.. అంబటి తనకు తనే ప్రశ్నించుకూంటూ.. 'ఈ మైక్ లో ఉంది. హెడ్ ఫోన్స్, సభలో ఉన్న లైట్లు, బల్ల కొనుగోలులో.. సభ గోడలు, అసెంబ్లీలో అవినీతి, అసెంబ్లీ ఏర్పాటుచేసిన రాజధానిలో అవినీతి, సచివాలయంలో అవినీతి, రోడ్ల నిర్మాణంలో అవినీతి. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రమంతా అవినీతి' విస్తరించిందన్నారు. కిలో మీటరు రోడ్డు వేయడానికి రూ.42 కోట్లు ఖర్చుచేశారని ఆరోపించారు. ఇక్కడ భవనాలు కట్టడానికి చదరపు అడుగుకి రూ.1500 అవుతుంది. కానీ, చంద్రబాబు రూ.6 వేల నుంచి 11 వేలు ఖర్చుపెట్టారని అన్నారు. అప్పటి ఎమ్మెల్యేలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారని ఆరోపించారు.

More Telugu News