త్వరితగతిన న్యాయం చేకూర్చేందుకే ‘దిశ’ చట్టం తెస్తున్నాం: సీఎం జగన్

13-12-2019 Fri 15:18
  • దిశ ఘటనలు పునారావృతం కాకూడదు 
  • ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు జరుగుతుంది
  • 14 రోజుల్లో విచారణ పూర్తయ్యేలా చట్టం తీసుకొస్తున్నాం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దిశ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై శాసన సభలో సుదీర్ఘ చర్చసాగింది. బిల్లుపై సీఎం జగన్ మాట్లాడుతూ.. గతంలో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉండేవన్నారు. వ్యవస్థలో మార్పుకోసమే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇటువంటి నిర్ణయాలతోనే మార్పు సాధ్యమని అన్నారు.

ఇప్పుడు ప్రతి చోట దిశ ఘటనపైనే చర్చ జరుగుతోందంటూ.. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. త్వరితగతిన న్యాయం చేకూర్చేందుకే దిశ చట్టం తెస్తున్నామని అన్నారు. ఈ చట్టం అమలులో భాగంగా ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు జరుగుతుందన్నారు. ఈ కోర్టుల్లో మహిళలు, పిల్లలపై జరిగే వేధింపులకు సంబంధించిన కేసుల విచారణ మాత్రమే జరుగుతుందని వెల్లడించారు.

ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, స్పెషల్ పోలీస్ టీమ్ ల ఏర్పాటు జరుగుతుందని చెప్పారు.   డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఈ టీమ్ లు ఉంటాయన్నారు. సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు పెడితే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. జిల్లా ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతుందన్నారు.

ఈ తరహా నేరాలకు పాల్పడితే.. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారని.. రెండోసారి కూడా అదే నేరం చేస్తే నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారని తెలిపారు. కచ్చితమైన ఆధారాలుంటే మరణ శిక్ష వేసేలా చట్టంలో మార్పులు చేపడుతున్నామన్నారు. 14 రోజుల్లో విచారణ పూర్తయ్యేలా చట్టం తీసుకొస్తున్నామన్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే నేరస్థుల వివరాలను డిజిటలైజేషన్ చేస్తామని చెప్పారు. చట్టాల్లో మార్పు తీసుకొచ్చే దిశగా యావత్ దేశం ఆలోచించాలని జగన్ పేర్కొన్నారు.