దిశ బిల్లుకు టీడీపీ మద్దతు.. స్వాగతిస్తున్నామన్న చంద్రబాబు!

13-12-2019 Fri 14:55
  • దిశ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం
  • ఇదే ఉత్సాహం అమలులో కూడా ఉండాలి  
  • చట్టం మనకు చుట్టం అనుకుంటేనే సమస్యలొస్తాయన్న బాబు  

ఏపీ అసెంబ్లీలో దిశ యాక్ట్ బిల్లు ఆమోదం పొందింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. మహిళల భద్రతపై ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయడం శుభపరిణామం అని, దీన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తోందని తెలిపారు. ఈ బిల్లును తమకు ఇవాళే ఇచ్చారని, దాన్ని పూర్తిగా పరిశీలించాల్సి ఉందన్నారు. బిల్లు తీసుకురావడంలో ఉన్నంత ఉత్సాహం అమలులోనూ ఉండాలన్నారు. చట్టం మనకు చుట్టం అనుకుంటే సమస్యలు ఉత్పన్నమవుతాయని, చట్టాన్ని చట్టంలా చూస్తే ఏ సమస్యా ఉండదని అభిప్రాయపడ్డారు.

అయితే, చట్టాలు చేయడంతో సరిపెట్టకుండా, సమస్యల్ని అధిగమిస్తూ వాటిని అమలు చేయడం చాలా ముఖ్యమని వైసీపీ సర్కారుకు హితవు పలికారు. దేశంలో ఈ తరహా చట్టాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, కేంద్రాన్ని కూడా సంప్రదించి దిశ చట్టం అమలును లోపరహితంగా మార్చాలని పిలుపునిచ్చారు. దిశ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని, దోషులు ఎంత గొప్పవాళ్లయినా శిక్షలు విధించేలా ఉండాలని స్పష్టం చేశారు.