నిర్భయ దోషులను ఉరితీసేందుకు సై అంటున్న 'తలారీ' వంశస్థుడు పవన్ జల్లాద్

13-12-2019 Fri 14:20
  • నిర్భయ దోషులకు ఉరి!
  • త్వరలోనే అమలు
  • తీహార్ జైల్లో ఏర్పాట్లు
దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ దోషులకు త్వరలో ఉరిశిక్ష అమలు చేస్తున్నట్టు ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లు చెబుతున్నాయి. కాగా, నిర్భయ కేసులో నలుగురు దోషులను ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీయనున్నారు. వీరిని ఉరి తీసేందుకు ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జైలు తలారీ పవన్ జల్లాద్ ఉత్సాహం చూపిస్తున్నారు. దీనిపై పవన్ జల్లాద్ మాట్లాడుతూ, నిర్భయ దోషులను ఉరితీయడాన్ని బాధ్యతగా భావిస్తున్నానని, ఢిల్లీ వెళ్లి తీహార్ జైలులో ఉరితీత బాధ్యతలను నెరవేరుస్తానని తెలిపారు.

పవన్ జల్లాద్ రక్తంలోనే తలారీ నేపథ్యం ఉంది. అప్పట్లో బ్రిటీష్ హయాంలో భగత్ సింగ్ ను ఉరితీసింది పవన్ ముత్తాత లక్ష్మణ్ రామ్. పతన్ తాత కల్లూ కూడా ఘనచరిత్ర కలవాడే. ఇందిరాగాంధీ హంతకులను ఉరితీయడంతో పాటు దేశంలో అనేక నేరాలకు పాల్పడిన బిల్లా, రంగాలకు ఉరి వేసింది కూడా కల్లూనే. పవన్ తండ్రి మమ్మూ సైతం తలారీనే. ఆయన నాలుగున్నర దశాబ్దాలకు పైగా మీరట్ జైలులో తలారీగా సేవలందించారు. ఆయన మరణానంతరం పవన్ జల్లాద్ ను తలారీగా నియమించారు.