పార్లమెంటు ఉభయసభలు నిరవధిక వాయిదా

13-12-2019 Fri 13:39
  • రాహుల్ వ్యాఖ్యలపై చివరి రోజు గందరగోళం
  • ఉభయ సభల్లోనూ మండిపడ్డ బీజేపీ ఎంపీలు
  • అలా వ్యాఖ్యానించడం సరికాదన్న రాజ్‌నాథ్‌

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. లోక్ సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. అలాగే, రాజ్యసభను కూడా నిరవధిక వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తెలిపారు. కాగా, ఉభయ సభల్లోనూ ఈ రోజు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు మండిపడ్డారు.

ప్రధాని మోదీ మేకిన్‌ ఇండియాను ప్రోత్సహిస్తోంటే, ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయని, అలాంటి మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని రేప్ ఇన్ ఇండియా అంటూ వ్యాఖ్యానించడం సరికాదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలోనూ బీజేపీ ఎంపీలు డిమాండ్‌ చేశారు. దీంతో ఉభయసభల్లోనూ గందరగోళ పరిస్థితులు కొనసాగాయి.