Disha: 'దిశ'ను చంపిన మృగాలు దిక్కులేని కుక్క చావు చావాలని మహిళలు కోరుకున్నారు: అసెంబ్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

  • దిశ ఘటన తర్వాత కొందరు ప్రకటనలకే పరిమితమైపోయారు
  • సీఎం జగన్ మాత్రం దేశానికే దిశా నిర్దేశం చేసే చట్టాన్ని రూపొందించారు
  • ఇప్పటికే ఉన్న ఎన్నో చట్టాలపై ప్రజల్లో నమ్మకం లేదు

ఏపీ ప్రభుత్వం తీసుకు వస్తోన్న 'దిశ' యాక్ట్ పై ఈ రోజు అసెంబ్లీలో చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అసెంబ్లీలో మాట్లాడారు. 'ఈ చట్టాన్ని ఒక డిప్యూటీ సీఎంగానే కాకుండా సాధారణ కుటుంబానికి చెందిన మహిళగానూ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. దిశ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా కొందరు ప్రకటనలకే పరిమితమైపోతే సీఎం జగన్ మాత్రం దేశానికే దిశా నిర్దేశం చేసే చట్టాన్ని రూపొందించినందుకు గర్వపడుతున్నాం. ఇంత గొప్ప మహిళా పక్షపాతి అయిన జగన్ నేతృత్వంలోని మంత్రి వర్గంలో డిప్యూటీ సీఎంగా గిరిజన మహిళనైన నాకు అవకాశం ఇచ్చినందుకు గర్వపడుతున్నాను. నా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను' అని వ్యాఖ్యానించారు.

'ఈ చట్టం మాలో ఓ నమ్మకాన్ని కలిగించింది. నిత్యం నరకాన్ని అనుభవిస్తోన్న మహిళా లోకానికి నమ్మకాన్నిచ్చింది. ఈ చట్టం వల్ల న్యాయస్థానంలో న్యాయదేవత కళ్లకు గంతలు తెరుచుకుని ఆదిపరాశక్తిగా మారి.. ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని శిక్షిస్తుందన్న నమ్మకం కలిగింది. రాక్షసుల చేతిలో బలైపోతోన్న మహిళల్లో ఈ చట్టాన్ని నమ్మకాన్ని నింపుతుంది' అని అన్నారు.

మహిళల పట్ల జరుగుతోన్న నేరాల నిరోధం కోసం ఇప్పటికే ఉన్న ఎన్నో చట్టాలపై ప్రజల్లో నమ్మకం లేదని పుష్ప శ్రీవాణి అన్నారు. 'అందుకే దిశను చంపిన మృగాలు దిక్కులేని కుక్కచావు తక్షణమే చావాలని ఈ దేశంలోని ప్రతి మహిళా కోరుకుంది. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులను శభాష్ అని మెచ్చుకున్నారు' అని వ్యాఖ్యానించారు. పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు జగన్ 'దిశ' చట్టం తెస్తున్నారని చెప్పారు.

More Telugu News