తెలంగాణలో కొత్తగా ఆరు విమానాశ్రయాలు: ప్రభుత్వం ప్రతిపాదన

13-12-2019 Fri 12:08
  • ఏరియల్‌ సర్వేకు అంగీకరించిన ఏఏఐ
  • రన్‌ వే, ఏటీసీకి అనుకూలతల పరిశీలన
  • అనంతరం నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌

తెలంగాణలో కొత్తగా ఆరు విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) సూత్రప్రాయ అంగీకారం తెలుపుతూ ఏరియల్‌ సర్వేకు సిద్ధమవుతోంది. రన్‌వే, ఏటీసీ, చుట్టుపక్కల ప్రాంతాలు, భూమి నాణ్యత తదితర అంశాలను రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌ మ్యాపింగ్‌ ద్వారా గుర్తిస్తారు. భౌగోళిక, వాతావరణ పరిస్థితులను కూడా అంచనా వేశాక విమానాశ్రయం నిర్మాణానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా? లేవా? అన్న దాన్ని నిర్థారిస్తారు. ఏఏఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా విమానాశ్రయాల నిర్మాణం జరుగుతుంది.

ప్రయాణికుల సౌలభ్యం, రవాణా అవసరాల దృష్ట్యా నిజామాబాద్‌, మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని  ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అద్దకల్‌, భద్రాద్రి కొత్తగూడెం వద్ద, వరంగల్‌ జిల్లా మామునూరు, ఆదిలాబాద్‌ నగర శివారు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌ ప్రాంతాల్లో భూసేకరణ కూడా చేశారు.

నిజానికి బసంత్‌నగర్‌, మామునూరు, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లలో చాలా దశాబ్దాల క్రితం విమానాశ్రయాల నిర్వహణ జరిగింది. నిజామాబాద్‌ నగరంలో గతంలో విమానాశ్రయం ఉండగా తాజాగా జక్రాన్‌ పల్లిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి సంబంధించిన సమగ్ర వివరాలు గతంలోనే కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపారు.

రైట్‌ సంస్థ సర్వే జరిపి  ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా, అవే ప్రతిపాదనలను ఏఏఐకి పంపారు. దీనిపై ఇప్పుడు జాతీయ విమానాశ్రయాల సంస్థ ఏరియల్ సర్వేను నిర్వహించనుంది.