మహిళలకు జగనన్న ఓ రక్ష, చెయ్యేస్తే పడుతుంది కఠిన శిక్ష: దిశ బిల్లును ప్రవేశపెట్టిన ఏపీ హోంమంత్రి సుచరిత

13-12-2019 Fri 11:58
  • మహిళలు నిర్భయంగా తిరిగే రోజులు రావాలి
  • ఓ అన్నగా జగనన్న మనసులో నుంచి పుట్టిన చట్టమే దిశ
  • ఏపీ హోమ్ మంత్రి సుచరిత

మహిళలు, బాలికలపై దారుణాలకు తెగబడే వారికి కఠిన శిక్షలు విధిస్తూ, ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన 'ఏపీ దిశ యాక్ట్' నేడు అసెంబ్లీ ముందుకు వచ్చింది. హౌస్ లో బిల్లును ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత, "ఆంధ్రప్రదేశ్ లో మహిళలందరికీ జగనన్న ఒక రక్ష - ఎవరైనా మహిళలపై చెయ్యి వేస్తే పడుతుంది కఠిన శిక్ష" అని వ్యాఖ్యానించారు.

ఈ చట్టంతో ఏదైనా నేరం జరిగితే, నేరస్తులు నిర్భయంగా సమాజంలో తిరిగే పరిస్థితి ఉండదని, 14 రోజుల్లో విచారణ పూర్తయి, 21 రోజుల్లోనే శిక్ష పడుతుందని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. రాష్ట్రంలోని మహిళలకు భరోసాను కల్పించేలా, ఓ అన్నగా జగనన్న మనసులో నుంచి వచ్చిన ఆలోచనే ఈ బిల్లని అన్నారు.

ఢిల్లీలో నిర్భయ నుంచి హైదరాబాద్ లో దిశ ఘటన వరకూ అన్నీ చూశామని, ఇకపై నిందితులు తప్పించుకుని తిరిగే పరిస్థితి ఏపీలో మాత్రం కనిపించబోదని స్పష్టం చేశారు. ఈ చట్టంలో భాగంగా ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంటుందని, త్వరితగతిన శిక్షలు విధించడమే కోర్టుల లక్ష్యమవుతుందని తెలిపారు. మహిళల పట్ల సామాజిక మాధ్యమాల్లో, ఫోన్ కాల్స్ లో అసభ్యంగా మాట్లాడినా కేసులు నమోదవుతాయని సుచరిత వ్యాఖ్యానించారు. వారికి రెండేళ్ల కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా పడుతుందని తెలిపారు. శిక్ష పడిన వారు మరోసారి అదే నేరం చేస్తే, నాలుగేళ్ల శిక్ష పడేలా చట్టాన్ని సవరిస్తున్నట్టు పేర్కొన్నారు.

బాలికలపై అత్యాచారాలకు, అఘాయిత్యాలకు తెగబడేవారికి పదేళ్ల నుంచి, పద్నాలుగేళ్ల శిక్ష పడుతుందని, హత్యలు చేస్తే మరణదండన కూడా విధిస్తారని స్పష్టం చేశారు. ఈ చట్టాల గురించి, జరిగిన మార్పుల గురించి ప్రతి మహిళా తెలుసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళల పట్ల అభయాంధ్రప్రదేశ్ గా మారుతుందన్న నమ్మకం తమకుందని వ్యాఖ్యానించారు.