ఆనాడు చంద్రబాబు గురించి రోశయ్య ఇదే మాట చెప్పారు అధ్యక్షా!: అసెంబ్లీలో మంత్రి బుగ్గన

13-12-2019 Fri 11:26
  • తాటతీస్తా.. గుండెల్లో నిద్రపోతా.. అంతుచూస్తా అంటున్నారు
  • గతంలో కూడా చంద్రబాబు అధికారుల గుండెల్లో నిద్రపోతా అని అన్నారు
  • పాపం ఇంట్లో సరిగ్గా పడుకోవట్లేదేమో అని అప్పట్లో రోశయ్య అన్నారు
  • ఎల్లప్పుడూ అధికారుల గుండెల్లోనే పడుకుంటున్నారని రోశయ్య అన్నారు

టీడీపీ నేతల తీరు, విమర్శలపై అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పందించారు. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిందేనని సభాపతిని కోరారు. 'మార్షల్స్ వాళ్ల డ్యూటీ చేస్తున్నారు. ట్రాఫిక్ కంట్రోల్ చేయడం ట్రాఫిక్ కానిస్టేబుళ్ల డ్యూటీ. అలాగే, ఇక్కడ పరిస్థితులపై మార్షల్స్ తమ పని తాము చేస్తారు. టీడీపీ నేతలు చర్చిద్దామన్న విషయాలన్నింటిపై చర్చిస్తున్నాం' అన్నారు.

'చంద్రబాబు పౌరుషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను చండశాసనుడిని, నేను తలుచుకున్నానంటే ఇది చేస్తా.. అది చేస్తాం.. పాతేస్తా.. తాటతీస్తా.. గుండెల్లో నిద్రపోతా.. అంతుచూస్తా అంటున్నారు.. గతంలో కూడా ఆయన అధికారుల గుండెల్లో నిద్రపోతా అని అన్నాడు.. పాపం ఇంట్లో సరిగ్గా పడుకోవట్లేదేమో ఎల్లప్పుడూ అధికారుల గుండెల్లోనే పడుకుంటున్నారని రోశయ్య అన్నారు అధ్యక్షా' అని బుగ్గన అన్నారు.

'ఏది ఏమైనా ఇది సరికాదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో నిన్న జరిగిన ఘటనలో ప్రమేయమున్న శాసనసభ్యులు, ఇతరులపైన సముచితమైన చర్యలు తీసుకుని, సభ్యుల, సిబ్బంది భద్రతను పరిరక్షించే అధికారాన్ని సభాపతికి ఇస్తూ ఈ సభ నిర్ణయం తీసుకుంది' అని బుగ్గన తెలిపారు. నిన్నటి ఘటనపై స్పీకర్ దే తుది నిర్ణయమని చెప్పారు.