Japan: ఈశాన్యాన అశాంతి... భారత పర్యటనను రద్దు చేసుకున్న జపాన్ ప్రధాని షింజో అబే!

  • గువాహటిలో ఆదివారం జరగాల్సిన సదస్సు
  • అసోంలో మిన్నంటుతున్న నిరసనలు
  • ఇప్పటికే బంగ్లాదేశ్ మంత్రుల పర్యటన రద్దు

పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందిన తరువాత, ఈశాన్య భారతావనిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడగా, ఆదివారం నాడు భారత పర్యటనకు రావాల్సిన జపాన్ ప్రధాని షింజో అబే, తన పర్యటనను రద్దు చేసుకునే ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని జపాన్ కు చెందిన జిజి ప్రెస్ వెల్లడించింది.

ఆదివారం నాడు అసోంలోని గువాహటిలో షింజో అబే, నరేంద్ర మోదీ మధ్య చర్చలు జరగాల్సి వుంది. ఈ సమయంలో అసోంలో పరిస్థితులు అనుకూలంగా లేవని భావించిన అబే, ఇండియాకు రాకపోవచ్చని సమాచారం. ఎలాగైనా సదస్సును నిర్వహించేందుకు భారత, జపాన్ ప్రభుత్వాలు మార్గాన్వేషణ చేస్తున్నాయని తెలుస్తోంది.

కాగా, ఇండియాకు రావాల్సిన బంగ్లాదేశ్ విదేశీ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్, హోమ్ మంత్రి అసదుజ్జామన్ ఖాన్ లు తమ మేఘాలయ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా అసోంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే.

More Telugu News