సైన్స్‌ టీచర్‌ అశ్లీల పాఠాలు.. 'బాలమిత్ర'కు విద్యార్థినుల ఫిర్యాదు

13-12-2019 Fri 11:23
  • రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న షీ టీమ్స్‌
  • షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయుని నిర్వాకం
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే వక్ర ఆలోచనతో వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించి సభ్య సమాజం నివ్వెరపోయేలా చేశాడు. సైన్స్‌ పేరుతో అశ్లీల వీడియోలు చూపించడమేకాక, తాకరాని చోట తాకి పైశాచిక ఆనందం పొందేవాడు. విషయం పోలీసులకు చేరడంతో వారు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని కటకటాల వెనక్కి పంపారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు..

షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో సైన్స్‌ టీచర్‌ విద్యార్థినులకు పాఠాలు బోధిస్తూ తన స్మార్ట్‌ ఫోన్‌లో ఆశ్లీల చిత్రాలు, వీడియోలు చూపిస్తున్నాడు. అంతేకాకుండా అప్పుడప్పుడూ కొందరిని టచ్‌ చేస్తుండేవాడు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా వ్యవహరించే వారిని కట్టడి చేసేందుకు సైబరాబాద్‌ పోలీసులు ‘బాలమిత్ర’ను ఏర్పాటు చేశారు. గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో చైతన్యవంతులైన అక్కడి విద్యార్థులు సైన్స్‌ ఉపాధ్యాయుని వక్రబుద్ధిని గమనించారు.

బాలమిత్రకు సమాచారం అందించారు. దీంతో షీ టీమ్స్‌ ఉపాధ్యాయునిపై డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. సదరు ఉపాధ్యాయుడు విద్యార్థినులకు అశ్లీల వీడియోలు చూపిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు.