బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయం

13-12-2019 Fri 11:05
  • 650 స్థానాల్లో బరిలో 3,322 మంది అభ్యర్థులు
  • 326 స్థానాల కంటే అధిక స్థానాల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయం
  • ప్రధానిగా రెండో సారి బాధ్యతలు స్వీకరించనున్న బోరిస్ జాన్సన్

బ్రిటన్‌లో నిన్న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. నాలుగేళ్ల వ్యవధిలో మూడోసారి ఈ ఎన్నికలు జరగడం గమనార్హం. మొత్తం 650 స్థానాల్లో 3,322 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ రోజు వెల్లడవుతోన్న ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ భారీ ఆధిక్యంతో ఉంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. అధికారం చేపట్టడానికి కావాల్సిన 326 స్థానాల కంటే అధిక స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. దీంతో ప్రధానిగా బోరిస్ జాన్సన్ రెండోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ దేశాన్ని ఐక్యంగా ఉంచి బ్రెగ్జిట్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు.  

బోరిస్‌ జాన్సన్‌ నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి, ప్రతిపక్ష నేత జెరిమీ కార్బిన్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ కొనసాగింది. ఇటీవల చేపట్టిన ఒపీనియన్‌ పోల్స్‌లోనూ కన్జర్వేటివ్‌ పార్టీయే గెలుస్తుందని తేలింది.  బ్రెగ్జిట్ ఒప్పందానికి మద్దతిచ్చేలా ఎంపీలను ఒప్పించలేకపోయినందుకు గతంలో బ్రిటిష్ ప్రధానమంత్రి పదవికి థెరెసా మే రాజీనామా చేయడంతో ఆ పదవిని బోరిస్ జాన్సన్ చేపట్టిన విషయం తెలిసిందే.