రెండో పెళ్లికి తొందర పడ్డానంటూ... హైదరాబాద్ లో వైద్యురాలి సూసైడ్!

13-12-2019 Fri 10:50
  • భర్తతో విడిపోయిన డాక్టర్ శ్రావణి
  • నవంబర్ 1న రెండో వివాహం
  • భర్త ఎలా చూసుకుంటాడోనన్న ఆందోళనతో ఆత్మహత్య

తాను తొందరపడి రెండో వివాహం చేసుకున్నానని, భర్త ఎలా చూసుకుంటాడో తెలియడం లేదని, జీవితంపై విరక్తితో ఉన్నానని సూసైడ్ లేఖను రాసిన ఓ వైద్యురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పరిధిలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, కళ్యాణ్‌ నగర్‌ కు చెందిన శ్రావణి (35) డాక్టర్ వృత్తిలో ఉన్నారు. కొన్నేళ్ల క్రితం భర్తతో వచ్చిన విభేదాల కారణంగా విడిపోయింది.

గడచిన నవంబర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే యువకుడిని రెండో పెళ్లి చేసుకుంది. తన ఉద్యోగం నిమిత్తం శ్రీనివాస్ తమిళనాడుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆమె బాత్ రూమ్ లో కిటికీకి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. బయటి నుంచి ఎంతసేపు తలుపు తట్టినా సమాధారం లేకపోవడంతో, అనుమానం వచ్చిన తల్లి, చుట్టుపక్కల వారి సాయంతో లోపలికి వెళ్లి చూడగా, శ్రావణి విగతజీవిగా కనిపించింది.

విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని శ్రావణి రాసిన ఆత్మహత్యా లేఖను స్వాధీనం చేసుకున్నారు. తల్లి దండ్రులు తనను బాగా చూసుకున్నారని, తానే రెండో పెళ్లికి తొందర పడ్డానని, కొత్తగా తన జీవితంలోకి వచ్చిన వ్యక్తి ఎలా చూసుకుంటాడో తెలియడం లేదని ఆందోళనగా వుందని రాసింది. తన సూసైడ్ కు ఎవరూ బాధ్యులు కాదని, తనకే జీవితంపై విరక్తి కలిగిందని పేర్కొంది. ఆత్మహత్యపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.