ప్రభుత్వ ఉద్యోగిని బూతులు తిడతావా?: చంద్రబాబుపై జగన్ నిప్పులు

13-12-2019 Fri 10:23
  • ఐదో రోజు కూడా వాడివేడిగా సభ
  • నిన్నటి ఉదంతంపై విమర్శలు, ప్రతి విమర్శలు
  • ప్రతిపక్ష నేత వ్యవహరించిన తీరు సరికాదన్న జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు ఐదో రోజుకు చేరుకోగా, సభ ప్రారంభంలోనే అధికార, విపక్ష సభ్యుల మధ్య నిన్న అసెంబ్లీ ముందు జరిగిన ఘటనపై తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికార పార్టీ తరఫున పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ తదితరులు మాట్లాడుతూ, మార్షల్స్ తో అనుచితంగా ప్రవర్తించిన చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గత అసెంబ్లీలో జరిగిన కొన్ని ఘటనలను ప్రస్తావించారు.

ఆపై నిన్నటి నిరసనలు, అసెంబ్లీ గేటు బయట జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను హౌస్ లో ప్రదర్శించారు. ఈ వీడియోలో మార్షల్స్ ను బాస్టర్డ్, యూజ్ లెస్ ఫెలో అని తిట్టడంతో పాటు, చీఫ్ మార్షల్ కాలర్ ను లోకేశ్ పట్టుకున్నట్టు కనిపిస్తోంది. వారి మధ్య జరిగిన వాగ్వాదాన్ని చూపించిన తరవాత జగన్ మాట్లాడుతూ, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

ప్రభుత్వ ఉద్యోగస్తుడిని, డీఎస్పీ స్థాయి అధికారిని బాస్టర్డ్ అని తిట్టినందుకు చంద్రబాబు సిగ్గు పడాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఉద్యోగులను అనరాని మాటలన్నారని, ఓ ప్రతిపక్ష నేతగా తమవారిని అదుపు చేయాల్సిన చంద్రబాబు, తన స్థాయిని దిగజార్చుకున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని మండిపడ్డారు. సభ్యులు కాని వారిని మాత్రమే మార్షల్స్ అడ్డుకున్నారని స్పష్టం చేసిన జగన్, చంద్రబాబు లోపలికి వచ్చేందుకు ప్రత్యేకమైన గేటు ఉన్నప్పటికీ, పార్టీ కార్యకర్తలను వెంటేసుకుని, ఊరేగింపుగా అసెంబ్లీలోకి మరో గేటు నుంచి రావడానికి ప్రయత్నించారని ఆరోపించారు.