వ్యవసాయ క్షేత్రంలోని కొత్త ఇంట్లోకి తాత్కాలిక గృహ ప్రవేశం చేసిన కేసీఆర్!

13-12-2019 Fri 09:44
  • ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఇల్లు
  • నైరుతీ భాగంలో నూతన నిర్మాణం
  • పాల్గొన్న మంత్రి కేటీఆర్

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామ సమీపంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో కొత్తగా కట్టించుకున్న ఇంట్లోకి కేసీఆర్ దంపతులు గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమం ఎటువంటి హడావుడి లేకుండా జరిగిపోయింది. ఫామ్ హౌస్ లోని నైరుతి భాగంలో ఈ ఇంటిని నూతనంగా నిర్మించగా, గో పూజ, వేద పండితుల పుణ్యహ వచనం తరువాత, ఇంట్లోకి వెళ్లిన కేసీఆర్ దంపతులు పాలు పొంగించారు.

వాస్తవానికి ప్రస్తుతం మంచి రోజులు లేవని, ఫిబ్రవరిలో మంచి ముహూర్తం చూసి పూర్తి స్థాయి గృహ ప్రవేశం చేయవచ్చని పండితులు చెప్పిన నేపథ్యంలో కుటుంబ సమేతంగా ఫామ్ హౌస్‌ కు వస్తే ఇబ్బంది ఉండకుండా చూసుకునేందుకు తాత్కాలికంగా గృహ ప్రవేశం జరిగినట్టు తెలుస్తోంది. ఇక కనీసం రెండు రోజులు ఇంట్లో ఉండాలని పండితులు సూచించడంతో నేడు కూడా ఆయన అక్కడే ఉండనున్నారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ తనయుడు, ఐటీ మంత్రి తారక రామారావు, మరో మంత్రి ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.