పాస్‌పోర్టులపై కమలం గుర్తు ఎందుకో వివరించిన కేంద్రం!

13-12-2019 Fri 09:42
  • లోక్‌సభలో కొత్త పాస్‌పోర్టులపై చర్చ
  • కమలం జాతీయ పుష్పమన్న రవీశ్ కుమార్
  • రొటేషన్ పద్ధతిలో మరిన్ని గుర్తులు ముద్రిస్తామని వివరణ

కొత్త పాస్‌పోర్టులపై కమలం గుర్తు ముద్రించడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కేంద్రం వివరణ ఇచ్చింది. కేరళలోని కోజికోడ్‌లో కమలం గుర్తు ముద్రించిన కొత్త పాస్‌పోర్టులను జారీ చేసిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవేంద్రన్ లోక్‌సభలో నిన్న జీరో అవర్‌లో లేవనెత్తారు. పాస్‌పోర్టులను కూడా బీజేపీ వదలడం లేదని, వాటిపైనా తమ పార్టీ గుర్తును ముద్రించి ప్రచారం చేసుకుంటోందని దుయ్యబట్టారు.

ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ మీడియాకు దీనిపై వివరణ ఇచ్చారు. నకిలీ పాస్‌పోర్టులను గుర్తించడం, భద్రతా చర్యల్లో భాగంగానే పాస్‌పోర్టులపై కమలం గుర్తును ముద్రించినట్టు రవీశ్ కుమార్ చెప్పారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, కమలం జాతీయ పుష్పమని పేర్కొన్నారు. రొటేషన్ పద్ధతిలో మున్ముందు మరిన్ని జాతీయ చిహ్నాలను కూడా ముద్రిస్తామని పేర్కొన్నారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ భద్రతా చర్యలు చేపట్టామని రవీశ్ కుమార్ చెప్పుకొచ్చారు.