BCCI: మా వల్లే గంగూలీ బీసీసీఐ చీఫ్‌ కాగలిగాడు: జస్టిస్ లోధా

  • మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పిరియడ్‌ను ఎత్తివేయాలని బోర్డు నిర్ణయం
  • జస్టిస్ లోధా సంస్కరణలకు మంగళం
  • తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జస్టిస్ లోధా

బీసీసీఐ నూతన రాజ్యాంగాన్ని సవరించేందుకు బోర్డు చేస్తున్న ప్రయత్నాలపై జస్టిస్ ఆర్ఎం లోధా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పిరియడ్‌ను ఎత్తివేయడంతోపాటు, పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనను ఎత్తివేయాలని, బోర్డు అధికారాలను తిరిగి కార్యదర్శికే ఇవ్వాలని సభ్యులు ప్రతిపాదించారు. అయితే, ఇది జస్టిస్ ఆర్ఎం లోధా సంస్కరణలకు విరుద్ధం. ఈ  సంస్కరణల ప్రకారం.. ఆరేళ్లపాటు  ఆఫీస్‌ బేరర్‌గా పనిచేస్తే మూడేళ్లు పదవికి దూరంగా ఉండాలి. గంగూలీ క్యాబ్ చీఫ్‌గా ఇప్పటికే రెండుసార్లు పనిచేశాడు. దీంతో బీసీసీఐ అధ్యక్షుడిగా పూర్తికాలం పనిచేసే అవకాశం గంగూలీకి లేకుండా పోయింది. తాజా ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే గంగూలీ మరో మూడేళ్లపాటు బీసీసీఐ చీఫ్‌గా పనిచేసే అవకాశం లభిస్తుంది.

అయితే, బీసీసీఐ రాజ్యాంగంలో మార్పులకు జరుగుతున్న ప్రయత్నాలపై జస్టిస్ లోధా స్పందించారు. తాము తీసుకొచ్చిన సంస్కరణల వల్లే గంగూలీ బీసీసీఐ బాస్ కాగలిగాడని అన్నారు. గంగూలీ చేస్తున్న మార్పులు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తమ సంస్కరణల కారణంగానే గంగూలీకి అత్యున్నత పదవి లభించిందని, పాత పద్ధతే కొనసాగి ఉంటే గంగూలీకి ఈ పదవి దక్కి ఉండేది కాదన్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని మార్చడం కాకుండా పూర్తిగా అమలయ్యేలా చూడాలని సూచించారు. అప్పుడే పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కనిపిస్తాయన్నారు. అలాగే, బీసీసీఐ మాజీ సభ్యుల బంధువులను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోలేమని స్పష్టం చేశారు. భారత పౌరుడిగా ఎన్నికల్లో పాల్గొనే న్యాయమైన హక్కు అందరికీ ఉంటుందని లోధా తేల్చి చెప్పారు.  

More Telugu News