మోదీ గారూ.. మీ ట్వీట్ ను వారు చూసే అవకాశం లేదు: కాంగ్రెస్ ఎద్దేవా

12-12-2019 Thu 14:19
  • పౌరసత్వ బిల్లుపై అసోం ప్రజలు ఆందోళన చెందాల్సిన  అవసరం లేదన్న మోదీ
  • అసోం ప్రజల హక్కులను ఎవరూ లాక్కోలేరంటూ ట్వీట్
  • ఇంటర్నెట్ కట్ చేస్తే మీ ట్వీట్ ను వారు ఎలా చూస్తారన్న కాంగ్రెస్

పౌరసత్వ సవరణ బిల్లుపై అసోం సోదర, సోదరీమణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అసోం ప్రజల హక్కులను కాపాడేందుకు తాను, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని ఆయన భరోసా ఇచ్చారు. అసోం ప్రజల హక్కులను ఎవరూ లాక్కోలేరని చెప్పారు.

ఈ నేపథ్యంలో మోదీ ట్వీట్ పై కాంగ్రెస్ మండిపడింది. అసోం సోదర, సోదరీమణులు మీరు భరోసా ఇస్తున్న ట్వీట్ ను చదవలేరని... వారికి ఇంటర్నెట్ సేవలను కట్ చేశారని... బహుశా ఈ విషయాన్ని మీరు మరిచిపోయి ఉండవచ్చని ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది.

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అసోంలో భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఇంటర్నెట్ సేవలను కట్ చేశారు. గౌహతిలో కర్ఫ్యూ విధించారు.