adi narayannareddy: వివేకానందరెడ్డి హత్య కేసులో 30 ప్రశ్నలు అడిగారు.. నా తప్పుంటే బహిరంగంగా ఉరి తీయాలని చెప్పాను: ఆది నారాయణరెడ్డి

  • ఆదినారాయణ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు 
  • వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో అందరి మనస్సాక్షికి తెలుసు
  • ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలి
  • అప్పుడే నిజానిజాలు వెల్లడవుతాయి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని కడపలోని తమ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు విచారించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు.

ఈ కేసులో తన ప్రమేయం ఏమీ లేదని తేల్చి చెప్పానని ఆది నారాయణరెడ్డి అన్నారు. ఈ హత్యకేసుకు సంబంధించి అన్ని కోణాల్లో తనను 30 ప్రశ్నలు అడిగారని వివరించారు. వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ తాను పూర్తి సమాధానాలు చెప్పానని అన్నారు. ఈ కేసులో తన తప్పు ఉంటే తనను బహిరంగంగా ఉరితీయాలని తాను అధికారులకు చెప్పానని వ్యాఖ్యానించారు.

వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో అందరి మనస్సాక్షికి తెలుసని చెప్పానని ఆది నారాయణరెడ్డి అన్నారు. ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని, అప్పుడే నిజానిజాలు వెల్లడవుతాయని ఆయన మీడియా ముందు డిమాండ్ చేశారు. 

More Telugu News