Chandrababu: ప్రతిపక్ష నేతగా కాకుండా పనికిమాలిన నాయకుడిగా మాట్లాడుతున్నారు: చంద్రబాబుపై రోజా నిప్పులు

  • చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం లేదు
  • ప్రజా సమస్యలపై నేను మాట్లాడితే సస్పెండ్ చేయలేదా
  • ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా బాబు వైఖరి

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతగా కాకుండా పనికిమాలిన నాయకుడిగా మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. ఈ ఉదయం జగన్ ను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు 'ఉన్మాది' అన్న పదం వాడటంతో చర్చ పక్కదారి పట్టి, వ్యక్తిగత విమర్శల వైపు వెళ్లింది. ఈ సమయంలో చంద్రబాబు సభకు, సీఎంకు క్షమాపణ చెప్పాల్సిందేనని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. రోజా మాట్లాడుతూ, గత అసెంబ్లీలో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

చంద్రబాబుకు వయసు పెరిగే కొద్దీ చాదస్తం కూడా పెరుగుతోందని విమర్శలు గుప్పించారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ ను తాను ప్రస్తావిస్తే, 'కామ సీఎం' అని తాను అన్నట్టు ఎల్లో మీడియాలో వార్తలు వేయించుకుని, తనను అన్యాయంగా సభ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. తాను కోర్టుకు వెళ్లి, పోరాడి, సస్పెన్షన్ ఎత్తివేతపై ఆదేశాలు తెచ్చుకున్నా సభలోకి రానివ్వలేదని గుర్తు చేశారు. ఆనాడు మార్షల్స్ తో తనను బలవంతంగా గెంటించారని, నాడు తనకు గాయాలు అయ్యాయని, ఆ వీడియోను చూపిస్తానని అన్నారు.

నాడు ప్రజా సమస్యలపై తాను మాట్లాడితే, ఏడాది పాటు సస్పెండ్ చేశారని, ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని మండిపడ్డారు.

More Telugu News