Edward St John: ఉద్యోగులకు క్రిస్మస్ కానుకగా రెడ్ కవర్... అందులో రూ. 35 లక్షలు.. అమెరికా కంపెనీ నజరానా!

  • మేరీలాండ్ కేంద్రంగా నడుస్తున్న సెయింట్ జాన్ ప్రాపర్టీస్
  • ఈ సంవత్సరం లక్ష్యాలను అందుకున్న సందర్భంగా గిఫ్ట్
  • ఉద్యోగుల కృషితోనే సంస్థ ఎదుగుతుందన్న ఎడ్వర్డ్ సెయింట్ జాన్

అమెరికాలోని మేరీలాండ్ కు చెందిన ఓ సంస్థ యజమాని, తన ఉద్యోగులకు క్రిస్మస్ బోనస్ గా 10 మిలియన్ పౌండ్లను ఇచ్చారు. మొత్తం 200 మంది ఉద్యోగులు ఉండగా, ఇటీవల జరిగిన క్రిస్మస్ డిన్నర్ సందర్భంగా ప్రతి ఒక్కరి చేతిలో ఒక రెడ్ కవర్ ఉంచారు. ఆ కవర్ లో సుమారు రూ. 35 లక్షలు (38 వేల పౌండ్లు) ఉన్నాయి. సెయింట్ జాన్ ప్రాపర్టీస్ సంస్థ ఈ సంవత్సరం అనుకున్న లక్ష్యాలను అధిగమించిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన వ్యవస్థాపక చైర్మన్ ఎడ్వర్డ్ సెయింట్ జాన్, ఉద్యోగులను తన ఆనందంలో భాగస్వామ్యులుగా చేయనున్నానని అంటూ, ఈ బహుమతిని అందించారని 'ది సన్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఇక తమ చైర్మన్ నుంచి ఈ గిఫ్ట్ ను అందుకున్న ఉద్యోగులు అమితానందంతో మునిగిపోయారు. తమ చేతుల్లోని రెడ్ కవర్ ను ఓపెన్ చేసి చూసిన తరువాత, వారి హావభావాల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ డబ్బుతో సంస్థ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని, తమ జీవితాలను మరింత ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటున్నట్టు 81 సంవత్సరాల ఎడ్వర్డ్ వ్యాఖ్యానించారు.

"ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి కృషి, అంకితభావంతోనే లక్ష్యాలను అధిగమించాము. నా ఆనందాన్ని తెలిపేందుకు ఇంతకన్నా మరో మార్గం కనిపించలేదు. నేను పడవను మాత్రమే నడుపుతున్నాను. పరుగులు పెడుతున్న పడవకు ఉద్యోగులంతా యజమానులే. వారు తమ సొంత సంస్థగా భావించి శ్రమిస్తున్నారు" అని ఎడ్వర్డ్ తెలియజేశారు.

More Telugu News