Maharashtra: బీజేపీతో మా మిత్రత్వం ముగిసిపోలేదు...మళ్లీ కలిసే అవకాశం ఉంది: శివసేన సీనియర్ నేత మనోహర్ జోషి

  • ఈ విషయంలో ఉద్ధవ్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు
  • పార్టీల మధ్య చిన్న చిన్న వైరుధ్యాలు సహజం 
  • మహారాష్ట్రలో అధికారంలో 'మహా వికాస్ అఘాడీ' ప్రభుత్వం

తెల్లవారితే మహారాష్ట్ర రాజకీయాల్లో ఏదో ఒక సంచలనం, చర్చకు తెరలేచే అంశం ఉండనే ఉంటోంది. ఇటీవల మహారాష్ట్ర రాజకీయాల్లో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే, ఏ పార్టీకీ మెజార్టీ రాని పరిస్థితుల్లో కూడికలు తీసివేతలు, ఫిరాయింపులు...ఇలా పలు సంచలనాల అనంతరం ఎట్టకేలకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ 'మహా వికాస్ అఘాడీ' కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే.

శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి అయ్యారు.  మంత్రివర్గ విస్తరణ కూడా జరగలేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా 'బీజేపీతో శివసేన మిత్రత్వం ముగిసిపోలేదు' అంటూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి బాంబు పేల్చారు.

ఈ ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ లా మారాయి. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో శివసేన, బీజేపీ మధ్య రాజకీయ యుద్ధమే జరిగింది. ఇరువర్గాలు మాటల తూటాలు పేల్చుకున్నాయి.

శివసేన మాటతప్పి మోసం చేసిందని బీజేపీ అరోపిస్తే, బీజేపీ మిత్ర ధర్మం పాటించడానికి ఒప్పుకోలేదంటూ శివసేన దీటుగా జవాబిచ్చింది. దీంతో రెండు పార్టీల మధ్య సయోధ్య ఇక మిధ్యే అనుకున్నారు. ఈ పరిస్థితుల్లో మనోహర్ జోషి వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

'ప్రస్తుతం విడిపోయినంత మాత్రాన శివ సేన, బీజేపీతో ఎప్పటికీ కలవదని అర్థం కాదు. రెండు పార్టీలు కలిసి పనిచేస్తేనే ఇరువర్గాలకు మేలు కలుగుతుంది. ఈ విషయంలో ఉద్ధవ్ థాకరే సరైన సమయంలోనే నిర్ణయం తీసుకుంటారు. చిన్నచిన్న సమస్యలపై విభేదించుకునే కంటే సర్దుకుపోవడం మంచిది. కీలక సమయాల్లో మన అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలో తప్పులేదు' అంటూ మనోహర్ జోషి వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటో త్వరలో బయటపడుతుందేమో చూడాలి.

More Telugu News