Andhra Pradesh: స్పీకర్ కు సభ్యత లేదన్న చంద్రబాబు... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తమ్మినేని!

  • స్పీకర్ స్థానానికి గౌరవం ఇవ్వరా?
  • వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందే
  • చంద్రబాబును ఉద్దేశించి స్పీకర్

అసెంబ్లీలో స్పీకర్ స్థానానికి కూడా గౌరవం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ ఉందని, ఆ పార్టీ నాయకుడే నోరు జారితే, ఎమ్మెల్యేలు ఎలా సంయమనంతో ఉంటారని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ ఉదయం ఇంగ్లీష్ మీడియం విషయమై చర్చ జరుగుతున్న సందర్భంగా, ఈ అంశంపై గురువారం నాడు సుదీర్ఘంగా చర్చించుకుందామని ముఖ్యమంత్రి జగన్, ఆర్థికమంత్రి బుగ్గన సూచించారు. ఈ చర్చ వ్యక్తిగత విమర్శల వైపు వెళ్లడంతో, చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారి తీశాయి. తనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరగా, ఆంగ్ల మాధ్యమంపై రేపు చర్చిద్దామని, నేడు ప్రవేశపెట్టాల్సిన బిల్లులు చాలా ఉన్నాయని స్పీకర్ అన్నారు.

ఆ సమయంలో చంద్రబాబు స్పీకర్ కు సభ్యత, సంస్కారం లేవని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు తక్షణం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేకుంటే వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామని తమ్మినేని హెచ్చరించారు. చంద్రబాబుపై తనకు గౌరవం ఉందని, అంతమాత్రాన పోడియంను అవమానిస్తే ఊరుకునేది లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఓ విపక్ష నేతగా గౌరవంతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలికారు. స్పీకర్ స్థానానికి మర్యాద ఇవ్వకుంటే ఎలాగని ప్రశ్నించారు. మీకున్న 40 ఏళ్ల అనుభవం ఎందుకు ఉపయోగపడిందని మండిపడ్డారు.

More Telugu News