Citizenship Amendment Bill: నేడు రాజ్యసభకు పౌరసత్వ బిల్లు... సభలో పార్టీల బలాబలాల వివరాలు!

  • బిల్లు పాస్ కావాలంటే మేజిక్ ఫిగర్ 121
  • ఎన్డీయే సంఖ్యాబలం 130
  • శివసేన దూరంగా ఉన్నా బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదు

బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పౌరసత్వ సవరణ బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది. ఈ రోజు మధ్యాహ్నం ఈ బిల్లు రాజ్యసభకు రాబోతోంది. ఈ నేపథ్యంలో, బిల్లును ఆమోదింపజేసుకోవడానికి ఎన్డీయే, వీగిపోయేలా చేసేందుకు యూపీఏలు కసరత్తు చేస్తున్నాయి. ఈ తరుణంలో, రాజ్యసభలో ఇరు పక్షాల సంఖ్యాబలం ఎంతుందో తెలుసుకుందాం.

రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న మొత్తం సంఖ్యాబలం 240. ఈ బిల్లు పాస్ కావాలంటే మేజిక్ ఫిగర్ 121. ఎన్డీయేలో బీజేపీతో కలిపి అన్నాడీఎంకే, జేడీయూ, అకాలీదళ్ సంఖ్యాబలం 116గా ఉంది. మరో 14 మంది తమకు మద్దతు పలుకుతారనని బీజేపీ భావిస్తోంది. ఇదే జరిగితే 130 మంది సభ్యుల మద్దతుతో ఈ బిల్లు సునాయాసంగా గట్టెక్కుతుంది. మిగిలిన 14 మంది సభ్యుల్లో శివసేనకు చెందిన ముగ్గురు, నవీన్ పట్నాయక్ కు చెందిన బీజేడీ సభ్యులు ఏడుగురు, వైసీపీకి చెందిన ఇద్దరు, టీడీపీకి చెందిన ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఒకవేళ ఓటింగ్ కు శివసేన దూరంగా ఉన్నప్పటికీ... బీజేపీకి వచ్చిన సమస్య ఏమీ ఉండదు.

యూపీఏ విషయానికి వస్తే... ప్రస్తుతం ఈ కూటమికి 64 మంది సభ్యులు ఉన్నారు. ఈ బిల్లును టీఎంసీ, టీఆర్ఎస్, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. వీటి సంఖ్యాబలం 46గా ఉంది. ఈ మొత్తం సంఖ్య 110 మాత్రమే ఉండటంతో... బిల్లు వీగిపోయే అవకాశం ఏమాత్రం లేదు. దీంతో, ఈరోజు రాజ్యసభలో బిల్లు గట్టెక్కబోతోందనే చెప్పవచ్చు.

More Telugu News