Hyderabad: విడాకుల కోసం జడ్జికి రూ. 15 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్.. బెంచ్ క్లర్క్ అరెస్ట్

  • హైదరాబాద్‌లో ఘటన
  • విడాకుల కోసం మూడేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్న అలోక్ వర్ధన్
  • తాను ఇప్పిస్తానంటూ బేరం కుదుర్చుకున్న బెంచ్ క్లర్క్

తనకు బైక్, జడ్జికి రూ.15 లక్షలు ఇస్తే త్వరగా విడాకులు ఇప్పిస్తానన్న బెంచ్ క్లర్క్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్టు ప్రాంగణంలోని అదనపు ఫ్యామిలీ కోర్టులో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్, కవాడిగూడకు చెందిన అలోక్‌వర్ధన్ సింగ్ తన భార్య నుంచి విడాకులు ఇప్పించాల్సిందిగా మూడేళ్ల క్రితం అదనపు కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. విచారణలు వాయిదా పడుతుండడంతో అలోక్‌వర్ధన్‌ను కలుసుకున్న బెంచ్ క్లర్క్ బొజ్జా రామకృష్ణ విడాకులు తాను ఇప్పిస్తానని అతడికి హామీ ఇచ్చాడు. అయితే, అందుకు కొంత మొత్తం ఖర్చవుతుందని చెప్పిన రామకృష్ణ.. తనకు ఓ బైక్, జడ్జికి రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

అతడు చెప్పింది విన్న అలోక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు అడ్వాన్స్‌గా నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని రామకృష్ణకు అలోక్ చెప్పాడు. మంగళవారం డబ్బులు తీసుకుని కోర్టుకు వస్తానని, అప్పటి వరకు కోర్టులోనే ఉండాలని సూచించాడు. అనుకున్నట్టే డబ్బులు తీసుకునేందుకు రామకృష్ణ బయటకు వచ్చి అలోక్‌ను కలిశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించిన ఏసీబీ అధికారులు రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం ఏసీబీ కోర్టులో అతడిని హాజరుపరిచారు. అనంతరం జైలుకు తరలించారు.

More Telugu News