Tamilnadu: స్మార్ట్ ఫోన్ లో అశ్లీల వీడియోలు చూస్తున్న వారిని కనిపెడుతున్న పోలీసులు... హెచ్చరికలు జారీ!

  • దిశ హత్యాచారం నేపథ్యంలో కదిలిన తమిళనాడు పోలీసులు
  • 3 వేల మందిని గుర్తించి హెచ్చరించిన సైబర్ క్రైమ్ అధికారులు
  • వైరల్ అవుతున్న వీడియో, ఆడియోలు

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని అదేపనిగా ఆన్ లైన్ లో అశ్లీల వీడియోలు చూస్తున్నారా? మీకు పోలీసుల నుంచి ఏ క్షణమైనా సమన్లు రావచ్చు. సైబర్ క్రైమ్ కు చిక్కితే ఏడేళ్ల వరకూ జైలు శిక్ష కూడా పడవచ్చు. తమిళనాడులో ఇప్పుడు అదే జరుగుతోంది. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లలో అశ్లీల వీడియోలను చూస్తున్న వారిని ఐపీ అడ్రస్ ల ఆధారంగా గుర్తిస్తున్న పోలీసులు వారికి హెచ్చరికలు పంపుతున్నారు. ఇప్పటికే దాదాపు 3 వేల మందిని గుర్తించిన చెన్నై సైబర్ క్రైమ్ అధికారులు, వీరికి క్లాస్ పీకేందుకు సిద్ధమవుతున్నారు.

కొందరిని పిలిపించి ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. అశ్లీల సైట్లలో గంటల కొద్దీ గడుపుతున్న వారిని గుర్తించడమే పనిగా పెట్టుకున్న పోలీసులు, తొలుత హెచ్చరించడం, ఆపైనా మారకుంటే కేసులు పెట్టి, కోర్టులో హాజరు పరచడం చేస్తున్నారు. తిరునల్వేలి ప్రాంతంలో 15 మంది అదేపనిగా అశ్లీల వీడియోలు చూస్తుండగా, వారిని హెచ్చరించారు. ఓ యువకుడికి ఫోన్ లో వార్నింగ్ ఇచ్చిన పోలీసు అధికారి, మరోసారి చూస్తే, ఏడు సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వస్తుందని అంటుండగా, సదరు యువకుడు బోరున వినిపిస్తున్న ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ లో వెలుగుచూసిన దిశ హత్యాచారం తరువాత మహిళల రక్షణ నిమిత్తం తమిళనాడు పోలీసులు పలు కీలక చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే అశ్లీల వీడియోలు చూస్తున్న వారిని గుర్తిస్తున్నారు. రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూరు నగరాలు మహిళలు, చిన్నారులకు సురక్షితమని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ నగరాల్లో హత్యలు, మోసాలు, ఆస్తి తగాదాలు అధికమే అయినా, మహిళలపై లైంగిక వేధింపుల కేసులు మాత్రం తక్కువేనని తేలింది.

More Telugu News