Airtel: ఏమిటీ వై-ఫై కాలింగ్... వివరాలు ఇవిగో!

  • ఎయిర్ టెల్ కొత్త సాంకేతిక పరిజ్ఞానం
  • వైఫై నెట్ వర్క్ తో కాల్స్ చేసుకునే సదుపాయం
  • ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు ఉపలబ్దం

ఇటీవల దేశంలో కాల్ డ్రాప్ సమస్య ఎక్కువవడం, తనకు రిలయన్స్ జియో నుంచి గట్టి పోటీ ఎదురవుతుండడం వంటి పరిణామాల నేపథ్యంలో దిగ్గజ మొబైల్ ఆపరేటర్ ఎయిర్ టెల్ 'వాయిస్ ఓవర్ వైఫై' టెక్నాలజీని ప్రవేశపెడుతోంది. దీన్నే 'వీఓ వై-ఫై' అంటారు. సాధారణంగా మొబైల్ లో కాల్స్ చేసుకోవాలంటే సిమ్ కార్డు సిగ్నల్ ఉండాలి. కానీ సెల్ నెట్ వర్క్ లేకపోయినా కాల్స్ చేసుకునే సదుపాయం 'వీఓ వై-ఫై' కాలింగ్ ద్వారా వీలవుతుంది.

ఈ విధానంలో అందుబాటులో ఉన్న వై-ఫై నెట్ వర్క్ ను ఉపయోగించుకుని మొబైల్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. ఒకరకంగా ఇది ఇంటర్నెట్ ఫోన్ కాల్ వంటిదేనని చెప్పాలి. ఇంటర్నెట్ ఫోన్ కాల్ లో పీసీ, ల్యాప్ ట్యాప్ ను ఉపయోగిస్తారు, వై-ఫై కాలింగ్ లో మొబైల్ ను ఉపయోగిస్తారు. అంతే తేడా! కొన్నిసార్లు ఇంట్లో ఉన్నప్పుడు సిగ్నల్స్ అందకపోవడం తెలిసిందే. అంతేకాదు, వాయిస్ మధ్యలోనే కట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం 'వాయిస్ ఓవర్ వై-ఫై కాలింగ్'.

దీని ద్వారా అద్భుతమైన శబ్దనాణ్యత సాధ్యమవుతుందని ఎయిర్ టెల్ భావిస్తోంది.  ఈ తరహాలోనే జియో 'వీఓ ఎల్టీఈ' పేరుతో తీసుకువచ్చినా, అది సిమ్ కార్డుతో మాత్రమే సాధ్యమవుతుంది. కచ్చితంగా మొబైల్ నెట్ వర్క్ కవరేజీ ఉండాల్సిందే!

ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఎలా పనిచేస్తుందంటే...

దీనికి ఎలాంటి యాప్ అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్ వైఫై కాలింగ్ కు అనువైనదేనా అని పరిశీలించాలి. లేదా, మీ డివైస్ ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ ను వై-ఫై కాలింగ్ కు అనుకూలమైన లేటెస్ట్ వెర్షన్ కు మార్చుకోవాలి. ఆపై సెట్టింగ్స్ లోకి వెళ్లి 'వై-ఫై కాలింగ్' ను ఎనేబుల్ చేయాలి. దీనికి ఎయిర్ టెల్ ఎలాంటి చార్జీ వసూలు చేయడంలేదు. ఇదో సాంకేతిక సదుపాయం మాత్రమే.  ఈ ఫీచర్ ఆన్ లో ఉన్నప్పుడు మొబైల్ నెట్ వర్క్ కవరేజి తగ్గిపోతే వెంటనే 'వై-ఫై కాలింగ్' ప్రారంభమవుతుంది.

ఏ ఫోన్లు 'వై-ఫై కాలింగ్' కు అనుకూలం?


ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోన్లలో షియోమీ తయారీ రెడ్ మీ కె20, రెడ్ మీ కె20 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ జె6, గెలాక్సీ ఎ10ఎస్, గెలాక్సీ ఓఎన్6, గెలాక్సీ ఎం30ఎస్, వన్ ప్లస్ సిరీస్ లో 7, 7 ప్రొ, 7టి, 7టి ప్రొ ఫోన్లు ఈ వైఫై కాలింగ్ ను సపోర్ట్ చేస్తున్నాయి. ఐఫోన్ 6ఎస్ నుంచి అన్ని ఐఫోన్లు ఈ టెక్నాలజీని కలిగివున్నాయి.

ఇది ఎలా పనిచేస్తుంది?

ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ప్రస్తుతానికి 'ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ఫైబర్ హోమ్ బ్రాడ్ బ్యాండ్' కనెక్షన్ ఉన్న వినియోగదారులకే అందుబాటులో ఉంటుంది. త్వరలోనే అన్ని బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు, దేశంలోని అన్ని వైఫై హాట్ స్పాట్లు ఉపయోగించుకుని ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ చేసుకునే సౌలభ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎయిర్ టెల్ చెబుతోంది.

More Telugu News