ICICI former CEO Chanda kotcher: ఆర్బీఐ ఆమోదం రాకముందే పదవి నుంచి ఎలా తొలగిస్తారు?: బాంబే హైకోర్టులో చందాకొచ్చర్ పిటిషన్

  • ఐసీఐసీఐ యాజమాన్యంపై ఇప్పటికే కేసు దాఖలు చేసిన కొచ్చర్
  • పిటిషన్ ను విచారించిన కోర్టు వివరణ కోరుతూ ఆర్బీఐకి నోటీసులు జారీ
  • తదుపరి విచారణ డిసెంబర్ 18కి వాయిదా

తనను పదవినుంచి తొలగించడాన్ని సవాల్ చేసిన ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందాకొచ్చర్ తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ను కూడా ప్రతివాదిగా చేర్చారు. తనను బ్యాంకు విధుల నుంచి తప్పిస్తూ ఆర్బీఐ చేసిన నిర్ణయాన్ని సవాలు చేశారు. ఈ మేరకు బాంబే హైకోర్టులో ఆమె పిటిషన్ వేశారు. ఇప్పటికే కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్ యాజమాన్యంపై కేసు వేసిన విషయం తెలిసిందే. గత మార్చి 13న కొచ్చర్ తొలగింపు నిర్ణయాన్ని ఆర్బీఐ ఆమోదించింది.

ఆర్బీఐ అనుమతికి ముందే జనవరి 31న ఐసీఐసీఐ యాజమాన్యం  ఆమెను విధులనుంచి తొలగించింది. అనంతరం దీనికి సంబంధించి అనుమతులు కోరుతూ బ్యాంక్ ఫిబ్రవరి 5న ఆర్బీఐకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మార్చి 13న కొచ్చర్ తొలగింపును సమర్థిస్తూ.. ఆమోదముద్ర వేసింది. అయితే, ఆర్బీఐ అనుమతి రాకముందే తనను విధుల నుంచి ఎలా తొలగిస్తారంటూ కొచ్చర్ తన పిటిషన్లో ప్రశ్నించారు. ఆమె పిటిషన్ ను విచారించిన కోర్టు ఆర్బీఐకి నోటీసులు జారీచేసింది. కేసు తదుపరి విచారణ ఈ నెల 18న జరుగనుంది.

More Telugu News