Nirbhaya: సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన 'నిర్భయ' కేసు దోషి అక్షయ్ సింగ్

  • సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన
  • దోషులకు ఉరిశిక్ష విధించిన కోర్టు 
  • శిక్ష తప్పించుకునేందుకు దోషుల ప్రయత్నాలు

దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ ఉదంతంలో దోషులకు మరికొన్నిరోజుల్లో ఉరిశిక్ష అమలు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దోషుల్లో ఒకరైన అక్షయ్ సింగ్ తనకు ఉరిశిక్ష విధించడంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. తనకు విధించిన శిక్షపై పునఃసమీక్ష చేయాలంటూ విజ్ఞప్తి చేశాడు.

అక్షయ్ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం స్వీకరించింది. అతని తరఫు న్యాయవాది ఈ అంశంపై మాట్లాడుతూ, అక్షయ్ రివ్యూ పిటిషన్ పై తీర్పు వచ్చిన తర్వాత దోషులందరూ కలిసి క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం గురించి ఆలోచిస్తామని వెల్లడించారు.

2012లో ఢిల్లీలో ఓ కదులుతున్న బస్సులో అత్యంత హేయంగా నిర్భయపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. తీవ్రగాయాలపాలైన నిర్భయ చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చారు. వారిలో ఒకరు మైనర్ కావడంతో అతడిని జువైనల్ కోర్టు ద్వారా విచారించి శిక్ష విధించారు. మిగతా అందరికీ కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన దోషుల్లో ఒకరు జైల్లోనే మరణించారు. ప్రస్తుతం నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

More Telugu News