YCP MLA Roja crticism against Telugudesam and Chandhra babu: టీడీపీ పాలనలో రైతులు 90 శాతం అప్పుల పాలయ్యారు: రోజా

  • రైతులు ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా? అంటూ నిలదీత
  • తమ ఉత్పత్తులకు మద్దతు రాక రైతులు అల్లాడారు
  • రైతు భరోసాను ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించక విమర్శిస్తారా?

ఏపీ అసెంబ్లీలో రైతు భరోసా పథకంపై వాడివేడీగా చర్చ సాగింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య వాగ్యుద్ధం కొనసాగింది.  వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, తనయుడు లోకేశ్ పై తీవ్ర విమర్శలు చేశారు. వర్ధంతికి, జయంతికి తేడా తెలియని స్థితిలో చంద్రబాబు తనయుడున్నాడని పేర్కొన్నారు. ఏపీ దేశమో, రాష్ట్రమో తెలియని స్థితిలో ఉన్నాడంటూ.. అమెరికా వెళ్లి చదువుకుంది ఇదేనా అని ప్రశ్నించారు.

సభలో నిన్న మహిళా భద్రతపై చర్చసాగుతూంటే.. టీడీపీ నేతలు ఉల్లిపాయల దండలు మెడలో వేసుకొని వచ్చి ఆందోళన చేశారన్నారు.  మహిళలకు మీరు ఇచ్చే విలువ ఇదేనా? అంటూ ప్రశ్నించారు. వారు చేసిన హడావిడి నేపథ్యంలో ఈ రోజు చర్చకు జగన్మోహన్ రెడ్డి అవకాశమిచ్చినప్పటికీ వారు ఉపయోగించుకోవడంలేదన్నారు.

‘టీడీపీ పాలనలో రైతులు 90 శాతం అప్పులపాలైంది నిజంకాదా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా? రైతులు తమ ఉత్పత్తులకు మద్దతు ధర రాక వారు నలిగిపోయిన పరిస్థితులు తెలియదా?’ అంటూ చంద్రబాబును సభాముఖంగా నిలదీశారు. రైతు బాంధవుడైన రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి రైతు శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు పోతున్నారని చెప్పారు. రైతు భరోసాను ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాల్సిందిపోయి.. ప్రతిపక్ష నాయకుడు విమర్శలకు దిగడం సబబు కాదన్నారు.

More Telugu News