Telugudesam: నిబంధనల మేరకే నాడు ఎన్టీఆర్ ను బీఏసీకి పిలవలేదు: వెల్లడించిన యనమల

  • నిబంధనల ప్రకారమే నేను వ్యవహరించా
  • ఎన్టీఆర్ తానే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు
  • సభలో జరిగిన దానికి భిన్నంగా బయట ప్రచారం జరిగింది

తెలుగుదేశం పార్టీ చీలిక సమయంలో జరిగిన పరిణామాలు వేరు అని, ఆరోజు నిబంధనలను అనుసరించే తాను ఎన్టీఆర్ ను బీఏసీ సమావేశానికి పిలవలేదని మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ చీలిక సమయంలో లోపల జరిగిన పరిణామాలకు, బయటకు వచ్చిన వార్తలకు సంబంధంలేదన్నారు.

నాడు ఎన్టీఆర్ తనను బీఏసీ సమావేశానికి ఎందుకు పిలవలేదు అని అడిగారని, అయితే అప్పటికే చంద్రబాబును టీడీఎల్పీ లీడర్ గా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని, అందుకే చంద్రబాబును మాత్రమే బీఏసీకి పిలవడం జరిగిందని ఎన్టీఆర్ కు తాను వివరించినట్లు చెప్పారు. అయితే, సభలోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్ బీఏసీకి పిలవకపోవడం గురించే మాట్లాడతానని పట్టుబట్టారని, నిబంధనల ప్రకారం ఆ అంశం మాట్లాడ కూడదని, అందుకే తాను అంగీకరించలేదని పేర్కొన్నారు. మిగిలిన విషయాల గురించి మాట్లాడవచ్చని ఎన్టీఆర్ కు చెప్పినప్పటికీ ఆయన తాను బీఏసీ సమావేశానికి పిలవకపోవడాన్ని తప్ప మిగితా ఏ విషయాన్నీ సభలో ప్రస్తావించనని బయటకు వెళ్లిపోయారని యనమల చెప్పారు.

More Telugu News