Saraswathi: రోజుకి 32 లీటర్ల పాల వెల్లువ... ప్రపంచ రికార్డు సృష్టించిన 'సరస్వతి'!

  • లుథియానాలో అంతర్జాతీయ పోటీ
  • వరుసగా మూడు రోజుల పాటు 30 లీటర్లకు పైగా పాలిచ్చిన గేదె
  • దీని దూడను రూ.4.5 లక్షలకు విక్రయించిన యజమాని

హర్యానాలోని హిస్సార్ జిల్లాకు చెందిన ఓ గేదె రోజుకి ఏకంగా 32 లీటర్ల పాలు ఇచ్చి, ప్రపంచరికార్డు నమోదు చేసింది. సరస్వతి అనే ఈ ముర్రా జాతి గేదె ఒక్క విడతలోనే 32.066 లీటర్ల పాలు ఇచ్చింది. గతేడాది పాకిస్థాన్ కు చెందిన ఓ గేదె స్థాపించిన రికార్డును సరస్వతి తిరగరాసింది. సరస్వతి వయసు ఏడేళ్లు. లుథియానాలో నిర్వహించిన ఓ అంతర్జాతీయ పోటీలో ఈ హిస్సార్ గేదె పాలవెల్లువ సృష్టించింది. వరుసగా మూడు రోజుల పాటు 30 లీటర్లకు తగ్గకుండా పాలివ్వడంతో సరస్వతి వరల్డ్ రికార్డు స్థాపించినట్టు నిర్వాహకులు ప్రకటించారు.

సరస్వతి తన యజమానికి పాలతోనే కాకుండా తన అండాలతోనూ ఎంతో రాబడి తెచ్చిపెడుతోంది. ఇది ముర్రా జాతికి చెందిన మేలు రకం గేదె కావడంతో దీని నుంచి తయారయ్యే అండాల నుంచి కృత్రిమ పద్ధతుల్లో దూడలను ఉత్పత్తి చేస్తున్నారు. సరస్వతిని అమ్మాలంటూ రూ.51 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నా దీని యజమాని సుఖ్ బీర్ ధండా మాత్రం ససేమిరా అంటున్నారు. సరస్వతికి పుట్టిన దూడను ఇటీవలే రూ.4.5 లక్షలకు అమ్మారంటే దీని క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

More Telugu News