దిశ నిందితుల ఎన్ కౌంటర్ బాధాకరం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత

10-12-2019 Tue 14:55
  • దిశకు అన్యాయం జరిగింది, బాధపడుతున్నా
  • ఆ నలుగురిని ఎన్ కౌంటర్ చేయడమూ బాధాకరమే..
  • ఆ నలుగురి తల్లిదండ్రులు ఎంత బాధ పడతారో ఆలోచించాలి

దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఎన్ కౌంటర్లో మృతుల పట్ల సానుభూతిని వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఈ ఎన్ కౌంటర్ బాధాకరమన్నారు. ఎన్ కౌంటర్లో మృతి చెందిన ఆ పిల్లల తల్లిడండ్రులు చాలా బాధపడి ఉంటారని వ్యాఖ్యానించారు. వారికి సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు.

ఆలేరులో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి  సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ‘దిశ అనే అమ్మాయికి అన్యాయం జరిగింది. మాకూ బాధ కలిగింది. కేసులో నిందితులైన ఆ నలుగురు పిల్లలను చంపేశారు. అందుకు కూడా బాధపడుతున్నాను. ఎందుకంటే ఆ నలుగురు పిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించాలి’ అన్నారు.