జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరం

10-12-2019 Tue 11:55
  • ఎన్ కౌంటర్లను జగన్ సమర్థించడం దారుణం
  • ఒక రెడ్డిగా జగన్ మాట్లాడారు
  • రాజ్యాంగంపై జగన్ కు నమ్మకం లేదు

హైదరాబాదు శివార్లలో దిశపై హత్యాచారం చేసిన నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి  జగన్ మాట్లాడుతూ... నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 'హ్యాట్సాఫ్ టు కేసీఆర్ గారు, తెలంగాణ పోలీసులు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేశారు' అని వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మరోవైపు, జగన్ వ్యాఖ్యలను ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరం తప్పుబట్టింది. ఫోరం అధ్యక్షుడు కందుల ఆనందరావు మాట్లాడుతూ, ఎన్ కౌంటర్లను జగన్ సమర్థించడం దారుణమని అన్నారు. రాజ్యాంగంపై జగన్ కు నమ్మకం లేదని మండిపడ్డారు. ఒక రెడ్డిగా జగన్ మాట్లాడారని విమర్శించారు. జగన్ చేసిన వ్యాఖ్యలను జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించాలని కోరారు. తెలంగాణలో దళిత మహిళను హత్యాచారం చేశారని... ఆ కేసులోని నిందితులను ఎన్ కౌంటర్ చేయమని కేసీఆర్ కు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.