Jagityala collector: రైతుకి ఉపశమనం.. లంచం సొమ్ము వెనక్కు ఇప్పించిన జగిత్యాల కలెక్టర్

  • వీఆర్వో, వి.ఆర్.ఏల సస్పెండ్
  • కలెక్టర్ చర్యపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు
  • భూమి పత్రాలతో పాటు లంచం సొమ్ము కూడా వెనక్కు

ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన కొందరు ఉద్యోగులు లంచాలు దండుకుంటూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ఇలాంటి ఇద్దరు అవినీతి పరుల బారిన పడ్డ ఓ వృద్ధుడు తాను సమర్పించుకున్న లంచం విషయాన్ని ఏకంగా కలెక్టర్ కే ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆ పెద్దాయన సమస్యను తక్షణం పరిష్కరించడమే కాకుండా, తీసుకున్న లంచాన్ని తిరిగి ఇప్పించారు.

వివరాల్లోకి వెళితే, తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన తాండ్య్రాల నర్సయ్య అనే వృద్ధుడికి సర్వే నంబర్ 424/12లో 4 గుంటల స్థలం ఉంది. ఆ స్థలాన్ని రెవెన్యూ ఉద్యోగులు వేరే వ్యక్తి పేరుపై నమోదు చేశారు. ఈ విషయమై సదరు వృద్ధుడు పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా పని కాలేదు.

ఈ క్రమంలోనే వీఆర్వో రూ. 8వేలు, వీఆర్ఏ రూ.2 వేలు లంచంగా తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన పని చేయకపోవడంతో ఈనెల 5న నర్సయ్య జగిత్యాల కలెక్టర్ ఎ. శరత్ కు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన కలెక్టర్ కొడిమ్యాల ఎమ్మార్వోను విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు.

సోమవారం జగిత్యాలలో జరిగిన ప్రజావాణిలో నర్సయ్యకు ఆయన పేరుపై సవరించిన భూమి ప్రతాలతో పాటు, లంచంగా వసూలు చేసిన సొమ్మును ఉద్యోగుల నుంచి తిరిగి ఇప్పించారు కలెక్టర్. అంతేకాకుండా లంచం తీసుకున్న వీఆర్వో, వీఆర్ఏ లను సస్పెండ్ కూడా చేశారు. కలెక్టర్ చర్యపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

More Telugu News