Disha: దిశ హత్యాచారం కేసులో కొత్త కోణం.. నిందితుల్లో ఇద్దరు మైనర్లు?

  • తమ కుమారులు మైనర్లన్న నిందితుల తల్లిదండ్రులు
  • ఆధార్ కార్డులు, బోనఫైడ్ సర్టిఫికెట్లు సేకరణ
  • నిందితుల్లో ఇద్దరు లారీ డ్రైవర్లని చెబుతున్నా లేని లైసెన్స్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో కొత్తకోణం ఒకటి వెలుగు చూసింది. ఎన్‌కౌంటర్‌లో హతమైన ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ వయసు 26 ఏళ్లు అని, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవుల వయసు 20 ఏళ్లని విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. అయితే, పోలీసులు చెబుతున్నట్టు దాంట్లో నిజం లేదని, నిందితుల్లో ఇద్దరు మైనర్లని వారి పుట్టిన రోజు తేదీలను బట్టి తెలుస్తోంది. ఇదే విషయాన్ని వారి తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘం విచారణ బృందానికి తెలియజేసినట్టు సమాచారం. మైనర్లని కూడా చూడకుండా తమ కొడుకులను ఎన్‌కౌంటర్ చేశారని నిందితుల తల్లిదండ్రులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

ఈ మేరకు నిందితుల ఆధార్ కార్డులు, పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్లను అధికారులు సేకరించారు. వాటి ప్రకారం ఓ నిందితుడి పుట్టిన రోజు ఆగస్టు 15, 2002. దాని ప్రకారం అతడి వయసు 17 సంవత్సరాల ఆరు నెలలు. అయితే, ఆధార్‌కార్డులో మాత్రం 2001గా నమోదైంది. మరో నిందితుడి పుట్టిన తేదీ ధ్రువపత్రంలో 10 ఏప్రిల్ 2004గా ఉంది. అంటే అతడి వయసు 15 సంవత్సరాల 8 నెలలు మాత్రమే. దీంతో నిందితుల వయసుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు లారీ డ్రైవర్లు అని పోలీసులు పేర్కొన్నారు. అయితే, వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని సమాచారం.

More Telugu News