Hyderabad: సీరియల్ నటుడు.. లగ్జరీ లైఫ్ కోసం దొంగగా అవతారం!

  • చోరీ సొమ్ముతో జల్సాలు
  • అతడిపై ఇప్పటి వరకు 9 కేసులు నమోదు
  • పీడీ చట్టం ప్రయోగించినా మారని బుద్ధి

సీరియళ్లలో నటించడం ద్వారా వస్తున్న డబ్బు లగ్జరీ లైఫ్‌కు సరిపోవడం లేదని ఓ నటుడు దొంగగా మారాడు. దొంగ సొత్తుతో జల్సా జీవితానికి అలవాటు పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నాగారం వికాశ్‌నగర్‌కు చెందిన బలిజ విక్కీ (28) టీవీ సీరియల్ నటుడు. నటన ద్వారా వస్తున్న డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో 2018లో చోరీల బాట పట్టాడు. అతడిపై కుషాయిగూడ, ఉస్మానియా యూనివర్సిటీ, నల్లకుంట పోలీస్‌స్టేషన్లలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి.

ఓయూ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. ఈ ఏడాది ఆగస్టు 9న బయటకు వచ్చిన విక్కీ తన ప్రవర్తన ఏమాత్రం మార్చుకోలేదు. నవంబరు 15న కూకట్‌పల్లి భాగ్యనగర్‌కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో చొరబడి ఫ్లాట్‌ తాళం పగలగొట్టి 300 గ్రాముల బంగారు నగలు అపహరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపార్ట్‌మెంట్‌ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి చోరీకి పాల్పడింది విక్కీయేనని గుర్తించారు. నిన్న ఉదయం అతడిని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి  రూ. 12 లక్షల విలువైన 330 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. విక్కీపై మరోమారు పీడీ యాక్ట్ ప్రయోగించనున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News