Jagan: జగన్ మాటిస్తే వెనక్కి తగ్గడు... చంద్రబాబు అలా కాదు: స్పీకర్ తమ్మినేని

  • స్పీకర్ ప్రత్యేక ఇంటర్వ్యూ
  • రాజకీయ పరిణామాలపై అభిప్రాయాల వెల్లడి
  • అనేక అంశాలపై స్పందన

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఓ మీడియా చానల్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకున్న రాజకీయ అనుభవంతో ఏపీ సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు మధ్య తేడా చెప్పారు. జగన్ ఒక్కసారి మాటిస్తే దానికే కట్టుబడి ఉంటాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కితగ్గడని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం అలా కాదని అన్నారు. తేలిగ్గా జారుకునే స్వభావం అని అభివర్ణించారు.

స్పీకర్ అయినంత మాత్రాన రాజకీయ నేపథ్యం లేకుండా పోదని, తాను శుద్ధ పప్పులా ఉండదలుచుకోలేదని, నిర్భయంగా తన అభిప్రాయాలు వెల్లడిస్తానని అన్నారు. ఇటీవల స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి రాజకీయాలు మాట్లాడుతున్నాడంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "స్పీకర్ హోదాను ఆస్వాదిస్తూ నన్ను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నించకుండా వదిలిపెట్టలేను" అంటూ తన వైఖరిని చాటిచెప్పారు.

రాజధాని అమరావతిపై బొత్స వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ, ఆయన సాధారణ కోణంలో వ్యాఖ్యానించారని తెలిపారు. అందులో తప్పుబట్టాల్సింది ఏమీ లేదని, తాను కూడా గతంలో ఎమ్మెల్యేగా సభకు వస్తున్నప్పుడు ఈ రాజస్థాన్ ఎడారిలో ఎక్కడుంది మన సభ? అని వ్యాఖ్యానించానని గుర్తు చేసుకున్నారు. రాజధాని అమరావతిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే స్పీకర్ గా తాను అదే నిర్ణయాన్ని శిరసావహిస్తానని, తనకు ఇందులో సొంత అభిప్రాయానికి తావులేదని తేల్చిచెప్పారు.

ఇక తాను సభలో నిద్రపోయినట్టు వచ్చిన ఆరోపణలకు కూడా తమ్మినేని బదులిచ్చారు. ఆ రోజున తాను నిద్రపోయినట్టు వచ్చిన కథనాలు అవాస్తవం అని, ఏదో చీటీ వస్తే  దాన్ని టేబుల్ కింద ఉంచి తల పక్కకు వాల్చి చదువుతుండగా కెమెరా కోణంలో నిద్రపోతున్నట్టుగా కనిపించిందని వెల్లడించారు. అంతేతప్ప, సభను పట్టించుకోకుండా తాను కునుకుతీశానని పేర్కొనడం సరికాదన్నారు.  

సీఎం జగన్ పై వచ్చిన డిక్లరేషన్ వివాదంపైనా స్పీకర్ మాట్లాడారు.. జగన్ దేవాలయాలకు, మసీదులకు, దర్గాలకు, చర్చిలకు, సిక్కు నిరంకారీ భవన్ లకు కూడా వెళతారని వెల్లడించారు. గతంలో వైఎస్సార్ ఐదు సార్లు తిరుమలలో శేషవస్త్రాలు స్వీకరించారని, ఆయనను డిక్లరేషన్ అడిగారా? అంటూ ప్రశ్నించారు. జగన్ భారతీయ పౌరుడు అయినప్పుడు డిక్లరేషన్ దేనికని నిలదీశారు.

"జగన్ పుట్టింది తెలుగు గడ్డపై అయినప్పుడు డిక్లరేషన్ ఎందుకు? ఆయనకు అన్ని మతాల వాళ్లు ఓటేసి మద్దతు తెలిపినప్పుడు ఇంకా జగన్ ను డిక్లరేషన్ అడగడంలో అర్థంలేదు" అని వ్యాఖ్యానించారు. జగన్ ను డిక్లరేషన్ అడిగితే ఇంకా చాలామందికి అడగాల్సి వస్తుందని అన్నారు.

More Telugu News