ఎన్ కౌంటర్ చేస్తే.. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లా?: రోజా

09-12-2019 Mon 15:44
  • నేరస్థులకు మానవ హక్కులుంటాయా? ఆడవాళ్లకు లేవా?
  • ఏపీలో రక్షణ ఉందంటూ ఇతర రాష్ట్రాల మహిళలు వచ్చేలా చట్టం జగనన్న తెస్తారు
  • మహిళల రక్షణకు నేరస్థులకు వణుకు పుట్టేలా చట్టం తేవాలని కోరుతున్నా
  • ఆంధ్ర ప్రదేశ్ అంటే ఆడవాళ్ల ప్రదేశ్ గా మారాలి
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభ రోజు మహిళల భద్రతపై చర్చ ఆసక్తికరంగా సాగింది. వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. రాష్ట్రం మహిళాంధ్రప్రదేశ్ గా మారాలని పేర్కొన్నారు. తెలంగాణలో చోటుచేసుకున్న దిశ హత్యాచార ఘటన తర్వాత, తొలిసారిగా ఏపీలో మహిళా భద్రతపై చర్చ సాగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మహిళలు ఆసక్తితో గమనిస్తున్నారన్నారు. అసెంబ్లీలో దీనిపై ఏమైనా చట్టాలు చేస్తారేమోనని ఎదురుచూస్తున్నారన్నారు. దిశను అత్యాచారం చేసి చంపి కాల్చివేసిన విధానం చూస్తే.. మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కన్నీళ్లొస్తాయని చెప్పారు.

 నిన్న దిశ, మొన్న రిషితేశ్వరి, అంతకు ముందు నిర్భయ.. ఇంకా ముందు చూస్తే స్వప్నిక, ప్రణీత.. మృగాళ్లకు బలయ్యారన్నారు. ఇలా మృగాళ్లకు బలి కావాల్సిందేనా అన్న భయంతో మహిళలు కంటిపై కునుకు లేకుండా భయభ్రాంతులకు లోనవుతున్నారన్నారు. మహిళను అడవిలో వదిలేసి వస్తే భద్రంగా బయటకు వచ్చే అవకాశముందేమో గానీ.. పొద్దున్న లేచి బయటకు వెళ్తే మాత్రం ఈ సమాజంలో తిరిగి వస్తుందనే నమ్మకం లేకపోవడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

జగనన్నను ఒకటే కోరాలనుకుంటున్నా.. ‘ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే వారికి వెన్నులో వణుకు పుట్టేలా ఒక చట్టాన్ని తేవాలి. ఆంధ్ర ప్రదేశ్ అంటే ఆడవాళ్ల ప్రదేశ్ గా మారాలి. ఏ రాష్ట్రంలోనైనా ఆడపిల్లకు భయం వేస్తే.. ఏపీలో తమకు రక్షణ ఉంటుందని భావించి మనవద్దకు వచ్చే పరిస్థితి జగన్ కల్పిస్తారని నమ్ముతున్నా. మానవ హక్కుల కమిషన్ దిశ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని నింపాల్సిన అవసరముంది. దిశను హత్యచేసిన వారిని ఎన్ కౌంటర్ చేస్తే మానవ హక్కుల ఉల్లంఘన అంటూ కొంతమంది పెద్ద ఎత్తున అరుస్తున్నారు. నేరస్థులకు మానవ హక్కులుంటాయా? ఆడవాళ్లకు లేవా? పిల్లలకు లేవా ?’ అని రోజా ప్రశ్నించారు.