Chandrababu: చంద్రబాబే నా పక్కన నిలబడితే... నేను ఏం మాట్లాడగలను అధ్యక్షా?: ఆనం రాంనారాయణ రెడ్డి

  • పీపీఏలపై అట్టుడుకుతున్న ఏపీ శాసనసభ
  • అరాచకశక్తులు అనే పదాన్ని ఉపయోగించిన చంద్రబాబు
  • అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ

విద్యుత్ ఒప్పందాలపై ఏపీ శాసనసభలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మాట్లాడుతుండగా... పక్క వరుసలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకున్నారు. అరాచకశక్తులు అంటూ వైసీపీ సభ్యులను విమర్శించారు. ఈ వ్యాఖ్యలను వైసీపీ సభ్యులు తప్పుబట్టారు.

ఆనం మాట్లాడుతూ, అరాచకశక్తులు అనే పదంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని, లేకపోతే అరాచకశక్తులు అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు. ప్రతిపక్ష నాయకుడే తన పక్కకు వచ్చి నిలబడితే, తాను ఏం మాట్లాడగలనని అన్నారు. చంద్రబాబును తట్టుకునేంత శక్తి తనకు లేదని చెప్పారు. చంద్రబాబు పక్క వరుస నుంచి తన సీటును మరో చోటుకు మార్చాలని కోరారు.

వైసీపీ మరో ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఇలా వ్యవహరించడం సరికాదని అన్నారు. భయపెడితే తాము భయపడబోమని చెప్పారు. ఒక పెద్దమనిషి ఇలా ప్రవర్తించడం సబబు కాదని అన్నారు. మరోవైపు, అరాచకశక్తులు అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

More Telugu News