Nirbhaya: నిర్భయ చట్టం తెస్తే మహిళలపై అకృత్యాలు ఆగాయా?: వెంకయ్యనాయుడు

  • పుణేలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి
  • మనుషుల ఆలోచనల్లో మార్పు రావాలని వ్యాఖ్యలు
  • ఇలాంటి ఘటనలు రాజకీయ కోణంలో చూడరాదని విజ్ఞప్తి

మనుషుల ఆలోచనల్లో మార్పు వస్తేనే మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన పుణేలోని సింబయోసిస్ డీమ్డ్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మనుషుల వైఖరిలో మార్పు రానంతవరకు ఎన్ని చట్టాలు తెచ్చినా ఉపయోగం ఉండదని, నిర్భయ చట్టం తెస్తే మహిళలపై అకృత్యాలు ఆగాయా? అని ప్రశ్నించారు. మహిళలపై హింస నివారణ కోసం కొత్త బిల్లు తీసుకువచ్చినా ఈ సమస్య పరిష్కారం కాదని తెలిపారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో మహిళను తల్లిగా, సోదరిగా పరిగణిస్తామని, మహిళలకు ఎలాంటి అవకాశం ఇచ్చినా సత్తా చాటుకుంటారని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. కానీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ఘటనలు నిజంగా సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ఇది సవాల్ వంటిదని పేర్కొన్నారు. మహిళల మీద వివక్ష, దాడులు ఆగిపోయేలా చూసేందుకు యువత స్వచ్ఛందంగా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా, మహిళల మీద జరిగే అకృత్యాలను మతం, ప్రాంతం, రాజకీయం అనే కోణాల్లో చూడరాదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలకు రాజకీయాలు ఆపాదిస్తే మహిళలపై దాడులు అరికట్టాలన్న అసలు లక్ష్యం దెబ్బతింటుందని అన్నారు.

More Telugu News