YSRCP: వైసీపీ ఎమ్మెల్యేలు రైతుల కన్నీటితో కూడిన రక్తం కూడు తింటున్నారు: పవన్ కల్యాణ్

  • తూర్పుగోదావరి జిల్లా వెలగతోడులో రైతులతో మాట్లాడిన పవన్  
  • నేతలు ఓట్ల కోసం పాదయాత్రలు చేస్తున్నారు
  • రైతుల కన్నీళ్లు తుడవడానికి ఇప్పుడు పాదయాత్రలు అవసరం
  • జగన్ ఇప్పుడు ప్రజల్లో తిరగాలి

తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెలగతోడులో రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. నేతలు ఓట్ల కోసం పాదయాత్రలు చేస్తున్నారని, రైతుల కన్నీళ్లు తుడవడానికి ఇప్పుడు పాదయాత్రలు అవసరమని ఆయన చెప్పారు. ఏపీ సీఎం జగన్ ఇప్పుడు ప్రజల్లో తిరగాలని ఆయన అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు రైతుల కన్నీటితో కూడిన రక్తం కూడు తింటున్నారని ఆయన అన్నారు.

రైతులకు న్యాయం జరిగే వరకు తాను పోరాడతానని పవన్ కల్యాణ్ అన్నారు. రైతుల ఆవేదన తనకు తెలుసని, లోతుగా విశ్లేషణ చేసి రైతు సమస్యలు తీర్చేందుకు ప్రణాళికలు వేస్తామని చెప్పారు. తనకు నిజాలు చెబితే విజిలెన్స్ దాడులు చేయిస్తామని రైస్ మిల్లర్లను వైసీపీ నేతలు బెదిరించారని, జిల్లాలో తన పర్యటన ఖరారు కావడంతో ప్రభుత్వం భయపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
 
రైతుల కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం అయినా కాలిపోవాల్సిందేనని, రైతులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనకి ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి, రైతులకు అండగా ఉండడానికి జనసేన పార్టీ వస్తోందని తెలుసుకొని రాత్రికి రాత్రి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రూ. 87 కోట్లను విడుదల చేశారని ఆయన అన్నారు. అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం అవుతుందని చెప్పారు.

గతంలో పండించిన పంటకు ధర రావడం లేదని క్రాప్ హాలిడే పెట్టారని, అప్పటి నుండి ఇప్పటి వరకు రైతులకు కన్నీరే మిగిలింది తప్ప చెప్పినవి ఏమి అమలులోకి రాలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. రైతులకు లాభ సాటి ధర వచ్చేలా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News