cudupha: వివేకానంద హత్య కేసు సీబీఐకి అప్పగించాలి : కన్నా డిమాండ్‌

  • ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ
  • నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్న
  • కేసు విషయాలు బయటపెట్టాలి

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి, కడప జిల్లా సీనియర్‌ రాజకీయ నాయకుడు వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు దిశానిర్దేశంలేకుండా సాగుతోందని, రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకుంటే తక్షణం సీబీఐకి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఈ ఏడాది మార్చిలో సార్వత్రిక ఎన్నికల ముందు వివేకానంద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

రాత్రి దుస్తుల్లో ఉన్న ఆయన మృతదేహం బాత్‌రూంలో పడివుండగా ఉదయం వ్యక్తిగత సహాయకులు గుర్తించారు. తొలుత ఆయన గుండె పోటుతో చనిపోయారని అంతా భావించారు. అయితే ఆయన తలపైనా, ముఖంపైనా పలు గాయాలు ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు భావించి అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు.

ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినప్పటికీ దాదాపు తొమ్మిది నెలలవుతున్నా కనీసం నిందితులు ఎవరన్నది గుర్తించ లేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కన్నా లేఖ రాశారు. మార్చిలో హత్య జరిగితే ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేకపోయారని, ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు. చేతకాకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి కేసు అప్పగించాలని కోరారు.


More Telugu News