మీకు ఢిల్లీలో అమిత్ షా అపాయింట్ మెంట్ లేదు, ఇక్కడ గల్లీలో జనాలకు ఉల్లి లేదు: నారా లోకేశ్

07-12-2019 Sat 20:48
  • సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు
  • పెరిగిన ఉల్లి ధరలపై స్పందన
  • అసమర్థ పాలన అంటూ వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. తన వ్యాఖ్యలకు కాస్తంత వ్యంగ్యం జోడిస్తూ, వైఎస్ జగన్ గారూ మీలాంటివాడే ఉట్టికెగరలేను కానీ స్వర్గానికి ఎగురుతానన్నాడట అంటూ సెటైర్ వేశారు. రాయితీపై కిలో ఉల్లిగడ్డలు ఇవ్వలేని మీరు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్నట్టే ఉంది అంటూ విమర్శించారు. మీకు ఢిల్లీలో అమిత్ షా అపాయింట్ మెంట్ లేదు, ఇక్కడ గల్లీలో జనాలకు ఉల్లి లేదు అంటూ ట్వీట్ చేశారు.

పాలన అంటే దుష్ప్రచారం చేయడం కాదు, తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని దోచుకోవడం కాదు, మంచి చేయడం అంటే ప్రజల్ని ఇలా రోడ్డునపడేయడం అంతకన్నా కాదు అంటూ మండిపడ్డారు. మీ చేతకాని పాలన కారణంగా కిలో ఉల్లిపాయల కోసం ప్రజలు పడే బాధలు చూడండి అంటూ ఓ వీడియోను కూడా ట్వీట్ చేశారు.