ఇంటి యజమానిని పిసినారి అంటూ తిట్టిపోసిన దొంగ!

07-12-2019 Sat 20:33
  • మధ్యప్రదేశ్ లో ఘటన
  • ఇంజినీర్ నివాసంలో చోరీకి వచ్చిన దొంగ
  • ఇంట్లో చిల్లిగవ్వ దొరకని వైనం

మధ్యప్రదేశ్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగ అక్కడేమీ దొరక్కపోయేసరికి ఇంటి యజమానికి తన నిరసన తెలుపుతూ లేఖ రాసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదర్శ్ నగర్ లో పర్వేశ్ సోనీ అనే ప్రభుత్వ ఇంజినీర్ నివసించే గవర్నమెంట్ క్వార్టర్ లో ఓ దొంగ ప్రవేశించాడు. ఎంతో కష్టమ్మీద కిటికీలు తొలగించి లోపలికి ప్రవేశించిన ఆ దొంగకు అక్కడ విలువైన వస్తువులేమీ కనిపించలేదు. ఎంతో ముఖ్యమైన నగదు అసలే లేదు.

దాంతో ఏం చేయాలో తెలియక ఇంటి యజమానికి ఓ లేఖ రాశాడు. 'నువ్వో పిసినారివి, నీలాంటివాడ్ని ఎక్కడా చూడలేదు' అంటూ తన ఉక్రోషాన్ని వెళ్లగక్కాడు. కిటీకీలు తొలగించడానికే ఎంతో సమయం పట్టింది, కనీసం ఆ శ్రమకు తగిన ఫలితం కూడా దక్కలేదు మీ ఇంట్లో' అంటూ లేఖలో తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ తర్వాతి రోజు ఉదయం పనివాళ్లు వచ్చి చూసేసరికి ఇంట్లో లేఖ కనిపించింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.